మృతుని ఖాతాల వివరాలు వారసులకు ఇవ్వాల్సిందే

6 Jul, 2018 03:00 IST|Sakshi

సీఐసీ ఆదేశం

న్యూఢిల్లీ: మృతుని అకౌంట్ల వివరాలను వ్యక్తిగత సమాచారం పేరుతో అతని వారసులకు ఇచ్చేందుకు నిరాకరించ రాదని పేర్కొన్న కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ) సంబంధిత అధికారికి జరిమానా విధించింది. చనిపోయిన తన తండ్రికి సంబంధించిన పోస్టాఫీసు అకౌంట్ల వివరాలు అందజేయాల్సిందిగా ఓ వ్యక్తి పోస్టల్‌ సూపరింటెండెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అది వ్యక్తిగత సమాచారం కాబట్టి, తాము ఇవ్వలేమంటూ సూపరింటెండెంట్‌ నిరాకరించారు. దీనిపై బాధితుడు సీఐసీని ఆశ్రయించారు.

విచారణ చేపట్టిన సమాచార కమిషనర్‌ శ్రీధర్‌ ఆచార్యులు.. ‘హిందూ వారసత్వ చట్టం ప్రకారం మృతునికి దరఖాస్తుదారు చట్టపరమైన వారసుడు. కాబట్టి అతడు  వ్యక్తిగత వివరాలు కోరినట్లుగా పరిగణించలేము. తండ్రికి సంబం ధించిన అన్ని అకౌంట్ల వివరాలు తెలుసుకునే హక్కు అతనికి ఉంది. మృతుని కుటుంబానికి పోస్టాఫీసు ఎటువంటి డబ్బు కూడా చెల్లించలేదు. కాబట్టి, దరఖాస్తు దారు అడిగిన మేరకు అకౌంట్లు, నిల్వల వివరాలు అందజే యాల్సిందే’ అని పేర్కొన్నారు. అంతేకాదు, దరఖాస్తుదారును ఇబ్బంది పెట్టినందుకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు