ఢిల్లీ అల్లర్ల కేసు : తాహిర్‌ హుస్సేన్‌ అరెస్ట్‌

5 Mar, 2020 15:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల సందర్భంగా ఐబీ ఉద్యోగి అంకిత్‌ శర్మ హత్య కేసు నిందితుడు, కౌన్సిలర్‌ తాహిర్‌ హుస్సేన్‌ను గురువారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అల్లర్లు జరిగేందుకు ప్రేరేపించారని కూడా ఆయనపై ఆభియోగాలు నమోదయ్యాయి. ఢిల్లీ రోజ్‌ ఎవెన్యూ కోర్టులో లొంగిపోయేందుకు వెళుతున్న క్రమంలో తాహిర్‌ హుస్సేన్‌ను ఢిల్లీ పోలీసు క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంకిత్‌ శర్మ హత్య కేసులో తనపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలైన క్రమంలో ఢిల్లీలోని కర్కర్‌దుమా కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ఐబీ ఉద్యోగి అంకిత్‌ శర్మ విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా దుండగులు ఆయనను కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఐబీ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని అల్లరి మూకలు దాడులకు తెగబడేలా తాహిర్‌ హుస్సేన్‌ రెచ్చగొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చాంద్‌బాగ్‌లోని హుస్సేన్‌ కార్యాలయంలో పెద్దసంఖ్యలో దుండుగులు ఆశ్రయం పొంది రాళ్లు రువ్వుతూ, పెట్రోల్‌ బాంబులు విసురుతూ హింసకు పాల్పడ్డారని అంకిత్‌ శర్మ తండ్రి ఆరోపించారు. మరోవైపు దయాల్‌పూర్‌, ఖజూరీఖాస్‌ పోలీస్‌ స్టేషన్లలోనూ హింసాకాండకు సంబంధించి హుస్సేన్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి.

చదవండి : ఢిల్లీ హింసపై చర్చ జరగాల్సిందే

మరిన్ని వార్తలు