-

దుర్మార్గుడి నుంచి పిల్లల్ని సురక్షితంగా కాపాడిన ఎన్‌ఎస్‌జీ

31 Jan, 2020 07:05 IST|Sakshi

ఫరూఖాబాద్‌(యూపీ) : పుట్టిన రోజు వేడుకకు పిల్లల్ని పిలిచి వారిని బందీలుగా చేసిన ఓ పాత నేరస్తుడిని గురువారం అర్ధరాత్రి ఎన్‌ఎస్‌జీ (నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌) చాకచక్యంగా మట్టుబెట్టింది. నేరస్తుడి చెర నుంచి పిల్లలందర్నీ సురక్షితంగా రక్షించింది. ఉత్తర ప్రదేశ్‌లోని మొహ్మదాబాద్‌ ప్రాంతం కతారియా గ్రామంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మొహమ్మదాబాద్‌ ప్రాంతం కతారియా గ్రామానికి చెందిన సుభాష్‌ బథమ్‌ పాత నేరస్తుడు. తన పుట్టిన రోజు వేడుక అంటూ గురువారం సాయంత్రం చుట్టుపక్కలుండే 23 మంది పిల్లలను ఇంటికి రప్పించుకున్నాడు. అనంతరం వారందరినీ బయటకు వెళ్లకుండా తన ఇంట్లోనే బందీలుగా ఉంచుకున్నాడు. అప్రమత్తమైన అధికారులు, అతడిని ఒప్పించి, పిల్లలను కాపాడేందుకు స్థానిక పెద్దలను, కుటుంబసభ్యులు, బంధువులను రప్పించారు.  

అక్రమంగా తనపై పోలీసులు హత్యకేసు మోపారంటూ ఆరోపించాడు. అతడి కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యేను కూడా తీసుకువచ్చారు. వారంతా నచ్చజెప్పేందుకు యత్నించగా లోపలి నుంచి ఆరు పర్యాయాలు కాల్పులు జరిపాడు. ఒక నాటుబాంబును కూడా బయట ఉన్న వారిపైకి విసిరాడు. దీంతో ఒకరికి గాయాలయ్యాయి. వెంటనే  అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎన్‌ఎస్‌జీను రంగంలోకి దించింది. అతడిని పలుమార్లు లొంగిపొమ్మని చెప్పగా ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు. దీంతో అతడిని ఎన్‌ఎస్‌జీ మట్టుబెట్టింది. పిల్లల్ని అతడి చెర నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది.  సుభాష్‌ బథమ్‌కు మతిస్థిమితం లేదని డీజీపీ ఓపీ సింగ్‌ తెలిపారు. అక్కడి  పరిస్థితిని ఎప్పటికప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు