యాసిడ్‌ దాడి బాధితులకు రిజర్వేషన్లు!

22 Jun, 2017 09:15 IST|Sakshi

న్యూఢిల్లీ: యాసిడ్‌ దాడి బాధితులు, మానసిక వికలాంగులు, ఆటిజంతో బాధపడుతున్న వారు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్‌ పొందే అవకాశాలున్నాయి. సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం(డీఓపీటీ) బుధవారం విడుదల చేసిన ముసాయిదా విధానంలో... దివ్యాంగులకు ఉద్యోగాలు, పదోన్నతుల్లో కోటా, వయో పరిమితిలో సడలింపులను ప్రతిపాదించింది. దివ్యాంగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్‌ కల్పించాలన్న అంశం సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్నందున తాజా చర్యకు అడ్డంకులు ఏర్పడే సూచనలూ కనిపిస్తున్నాయి.

దివ్యాంగులకు కేటాయించిన ఖాళీల్లో ఐఏఎస్‌ అధికారుల కార్యాలయ సహాయకుల పోస్టులున్నాయి. డైరెక్ట్‌ నియామక ప్రక్రియలో ఏ,బీ,సీ,డీ గ్రూపులలోని మొత్తం ఖాళీల్లో నిర్దేశిత అంగవైకల్యం ఉన్న వారికి 4 శాతం కేటాయిస్తారని డీఓపీటీ తెలిపింది. అలాగే యాసిడ్‌ దాడి బాధితులతో పాటు ఆటిజం, మానసిక వికలాంగులు, దృష్టి, వినికిడిలోపం(సంయుక్తంగా) ఉన్నవారికి 1 శాతం రిజర్వేషన్‌ను ప్రతిపాదించారు.

పదోన్నతులకు సంబంధించి గ్రూప్‌ డీ, సీలోని మొత్తం ఖాళీల్లో ప్రామాణిక అంగవైకల్యం ఉన్న వారికి 4 శాతం కేటాయిస్తారు. అంగవైకల్యం 40 శాతం కన్నా తక్కువ ఉన్న వారే ఈ రిజర్వేషన్లకు అర్హులని ముసాయిదా విధానంలో పేర్కొన్నారు. వయో పరిమితి సడలింపు 10–13 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు