అసాధారణం.. మన పాటవం..

19 Mar, 2016 01:05 IST|Sakshi
అసాధారణం.. మన పాటవం..

కళ్లు చెదిరేలా యుద్ధ విమానాల విన్యాసాలు
♦ రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలో వైమానిక దళ శక్తి ప్రదర్శన
♦ సుఖోయ్, జాగ్వర్, మిరేజ్‌ల సందడి
 
 పోఖ్రాన్: మన వైమానిక దళ పాటవమేంటో మరోసారి ప్రపంచం కళ్లారా వీక్షించింది. శత్రుదేశాలకు గుబులు పుట్టించే రీతిలో భారత వైమానిక దళం తన శక్తి సామర్థ్యాలు ఏపాటివో అత్యద్భుతంగా, అబ్బుర పరిచేవిధంగా ప్రదర్శించింది. భారతదేశ సర్వసైన్యాధ్యక్షుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం శాఖ, రక్షణ శాఖ మంత్రులు  ఇతర అతిరథమహారథులు వీక్షిస్తుండగా అణ్వస్త్ర ప్రయోగ భూమి రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌లో శుక్రవారం భారత వైమానిక విన్యాసాలు జరిగాయి. 

థార్ ఎడారిలో భారత్ అణ్వస్త్రాలను రెండు సార్లు విజయవంతంగా ప్రయోగించిన పోఖ్రాన్ యుద్ధ విమానాల విన్యాసాలతో రణభూమిగా మార్మోగిపోయింది. ‘ఐరన్ ఫిస్ట్-2016’ పేరిట పొఖ్రాన్‌లో నిర్వహించిన ఈ షోలో ఎయిర్‌క్రాఫ్ట్‌లు కళ్లుచెదిరే విన్యాసాలతో కట్టిపడేశాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ విన్యాసాలను ప్రారంభించారు.  ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 22 రకాల యుద్ధ వైమానిక వేదికల నుంచి ఆయుధ వ్యవస్థలు తమ పాటవాన్ని ప్రదర్శించాయి. తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ద్వారా గాలిలో నుంచి గాలిలో క్షిపణిని ఛేదించడం అబ్బురపరిచింది. భూమి నుంచి గాలిలో క్షిపణిని ఛేదించే ఆకాశ్ క్షిపణిని కూడా ఇందులో ప్రదర్శించారు.

త్వరలో సైన్యంలోకి చేరనున్న తేలికపాటి యుద్ధ హెలికాఫ్టర్ రాకెట్లను ప్రయోగించింది. ఫైటర్ జెట్‌లు- సుఖోయ్ 30, మిరేజ్-2000, మిగ్-27, జాగ్వర్‌లు ఆకాశంలో సందడి చేశాయి. రాత్రిపూట నిర్వహించిన ప్రదర్శనలో 180 యుద్ధవిమానాలు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. నిశ్శబ్దంగా ఉన్న నీలి ఆకాశం మండితున్నట్లు భ్రమ కలిగించేలా ఈ  ప్రదర్శన  సాగింది. ఇందులో పలు ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్‌లు పాల్గొన్నాయి. భారతీయ వాయుసేన సామర్థ్యం తెలియచెప్పడమేనని విన్యాసాల ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని ఎయిర్‌ఫోర్స్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఎక్సర్‌సైజ్ ఐరన్ ఫిస్ట్‌ను 2013లో మొదటిసారి నిర్వహించారు.

మరిన్ని వార్తలు