వారిని ఎందుకు విమర్శించరు?

14 May, 2020 14:02 IST|Sakshi

న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు వేరే పదవులు తీసుకుంటే ఎందుకు విమర్శిస్తారని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్‌ గొగొయ్‌ ప్రశ్నించారు. అదే యాక్టివిస్ట్‌ జడ్జీలు, రిటైర్‌ అయ్యాక డబ్బు సంపాదన కోసం మధ్యవర్తిత్వం నెరిపే న్యాయమూర్తులపై ఎలాంటి విమర్శలు ఎదురుకావని అన్నారు. ఢిల్లీలో నేషనల్‌ లా యూనివర్సిటీ పూర్వవిద్యార్థుల వెబినార్‌లో గొగొయ్‌ మాట్లాడారు. మాజీ జడ్జీల్లో మూడు కేటగిరీలు ఉన్నాయని అన్నారు. (తెల్లరంగు దుస్తులు ధరించండి)

రిటైరయ్యాకా న్యాయవ్యవస్థ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే యాక్టవిస్టు జడ్జీలు, వివాదాలను పరిష్కరించడంలో లాయర్లకు సలహాలిస్తూ డబ్బులు సంపాదించే మాజీ జడ్జీలు, రిటైరయ్యాక ఏదో ఒక పదవి పొందే జడ్జీలు ఇలా 3 కేటగిరీలు ఉన్నప్పటికీ ఎప్పుడూ పదవులు తీసుకునే వారు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. మిగతా రెండు విభాగాల వారిని ఎందుకు వదిలిపెడుతున్నారని నిలదీశారు. జడ్జీగా ఉన్నపుడు నిబద్ధతతో ఉంటే, ఆ తర్వాత ఎలాంటి ఉద్యోగానికి వెళ్లినా వచ్చే నష్టమేమిటని ఆయన ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ విమర్శలకు వ్యతిరేకం కాదని.. నిజాయితీ, మేధో, విద్యాపరమైన కసరత్తు లేకుండా విమర్శలు చేయడం సరికాదని అన్నారు.

జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ 2018 అక్టోబర్‌ నుంచి 2019 నవంబర్‌ వరకు ప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అయోధ్య వివాదం వంటి కీలక కేసుల్లో చారిత్రక తీర్పులు వెలువరించిన ఆయనకు బీజేపీ రాజ్యసభ సీటు ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 19న రాజ్యసభ సభ్యునిగా ఆయన ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగా ప్రతిపక్ష సభ్యులు ‘షేమ్, షేమ్‌’అని నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఒక సభ్యుని ప్రమాణ స్వీకారం చేస్తుండగా సభ్యులు ఇలా వాకౌట్‌ చేయడం రాజ్యసభ చరిత్రలో ఇదే మొదటిసారి. (చిన్న సంస్థలకు.. పెద్ద ఊరట!)

మరిన్ని వార్తలు