కాంగ్రెస్‌ పార్టీ, శశిథరూర్‌కు.. లిసీప్రియా చురకలు!

9 Mar, 2020 08:39 IST|Sakshi

ప్రధానికి నో.. కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు

ఇంఫాల్‌: వాతావరణ మార్పు కార్యకర్త, చిచ్చర పిడుగు లిసీప్రియా కంగుజం కాంగ్రెస్‌ పార్టీ, ఎంపీ శశిథరూర్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చింది. తనపై సానుభూతి చూపించింది చాలని... పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మీరేం చేస్తున్నారో చెప్పాలంటూ చురకలు అంటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్‌ మీడియా ఖాతాను నడిపేందుకు పలువురు మహిళలకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లిసీప్రియాను కూడా ప్రశంసిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. అయితే ఈ విషయం ఎనిమిదేళ్ల చిన్నారి లిసీప్రియాకు అంతగా నచ్చలేదు. అందుకే ‘‘ రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను ఉపయోగించుకోవాలని చూడకండి... మీకు అనుకూలంగా నేను పనిచేయలేను’’ అని హెచ్చరించింది.(ప్రధాని సోషల్‌ ఖాతాలు ఆ ఏడుగురికి)

ఈ నేపథ్యంలో లిసీప్రియా నిర్ణయాన్ని సమర్థిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శశి థరూర్‌ ట్వీట్‌ చేశారు. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు వీలుగా తాను మూడేళ్లుగా జాతీయ వాయుశుద్ధి విధానం తీసుకవచ్చే విధంగా కృషి చేస్తున్నానని.. కాంగ్రెస్‌ పార్టీ మొదటి ప్రాధాన్యత ఇదేనని పేర్కొన్నారు. అయితే లిసీప్రియా మాత్రం ఆయన ట్వీట్‌కు సానుకూలంగా స్పందించలేదు. తనకు మద్దతుగా నిలిచినందుకు ప్రశంసిస్తున్నా అంటూనే.. తన ప్రధాన డిమాండ్లు ఏంటో మరోసారి ఆయనకు గుర్తుచేసింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సైతం తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో...‘‘ కేవలం మాటలకే పరిమితమయ్యే ప్రధాని మోదీ.. మహిళా సాధికారికత అనుసరిస్తున్న నయవంచక విధానాలను పర్యావరణ కార్యకర్త లిసీప్రియా కంగుజం తిరస్కరించింది. ఇతరుల ట్విటర్‌ ప్రచారం కంటే కూడా తన గొంతుకే తనకు ముఖ్యమని తేల్చిచెప్పింది’’అని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించింది. (15 మందికి నారీ శక్తి పురస్కారాలు)

ఇందుకు స్పందించిన లిసీప్రియా... ‘‘ సరే. నా పట్ల మీరు సానుభూతి ప్రదర్శించారు. బాగుంది. అయితే ఇప్పుడు అసలు విషయానికొద్దాం. లోక్‌సభ, రాజ్యసభ ప్రస్తుత సమావేశాల్లో ఎంత మంది కాంగ్రెస్‌ పార్టీలు నా డిమాండ్లను సభల్లో వినిపిస్తున్నారు. మీరు కూడా ట్విటర్‌ ఉద్యమానికి కోసం నన్ను ఉపయోగించుకుంటానంటే ఒప్పుకోను. అసలు నా గొంతు ఎవరు వింటున్నారు?’’ అని విమర్శించింది. కాగా మణిపూర్‌కు చెందిన లిసీప్రియా... వాతావరణ కాలుష్యం నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. స్వీడన్‌ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌లా ఈ భూగోళాన్ని కాలుష్యం నుంచి కాపాడే ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకుని.. ముందుకు సాగుతోంది.

ఈ నేపథ్యంలో మీడియా తనను ఇండియన్‌ గ్రెటా అని ప్రస్తావిస్తే ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ చిన్నారి.. ‘‘ నేను నేనే’’ తనను ఎవరితో పోల్చవద్దని హెచ్చరించింది. ఇక ప్రస్తుతం ప్రధాని ఆఫర్‌కు నో చెప్పడంతో పాటుగా... తనను రాజకీయాల్లోకి లాగవద్దంటూ ఇటు అధికార పార్టీ, అటు విపక్షానికి వార్నింగ్‌ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది. ‘‘వాతావరణ మార్పు కోసం భారత్‌లో చట్టం తీసుకురావాలి. భారత విద్యావ్యవస్థలో వాతావరణ మార్పు సబ్జెక్టును తప్పనిసరి చేయాలి. భారత్‌లోని ప్రతీ విద్యార్థి కనీసం పది మొక్కలను నాటితేనే వార్షిక పరీక్షలు ఉత్తీర్ణులయ్యేలా నిబంధన విధించాలి’’అనే ప్రధాన డిమాండ్లతో ముందుకు సాగుతానని మరోసారి స్పష్టం చేసింది. నిజంగా తను చిచ్చర పిడుగే కదా.. ఏమంటారు?!

మరిన్ని వార్తలు