సమాచార హక్కుపై కేంద్రం వేటిది

18 Jul, 2018 15:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో సమాచార హక్కు చట్టంలో సవరణలు తీసుకొచ్చే బిల్లును ప్రవేశ పెడుతుందన్న ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. అయితే ఆ బిల్లులో ఏముంటుందన్న విషయం నిన్నటి వరకు వెల్లడి కాలేదు. ఈ చట్టంలోని సవరణ ప్రతిపాదనల గురించి కేంద్రం మంగళవారం పార్లమెంట్‌ సభ్యులకు ఓ సర్కులర్‌ జారీ చేసింది.

కేంద్ర, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్లతోపాటు, సమాచార కమిషనర్ల జీత భత్యాలను, వారి పదవీకాలాన్ని నిర్ణయించే అధికారం ఇక కేంద్రానికి దఖలు పడుతుందని అందులోని సారాంశం. తద్వారా కేంద్ర ప్రభుత్వం సమాచార కమిషనర్లందరిని తన గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తోంది. ఈ అధికారాలు కేంద్రానికి సిద్ధించినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సమాచార కమిషనర్లు భయపడాల్సి వస్తుందని, లేదంటే జీత, భత్యాల విషయంలో కోత పెట్టడం, పదవి నుంచి తొలగింపు లాంటి బెదిరింపులతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆర్టీఐ చట్టం ఆవశ్యకత గురించి విస్తృతంగా ప్రచారం చేసిన మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌ నిఖిల్‌ దేవ్‌ వ్యాఖ్యానించారు. ఇది చట్టాన్ని పూర్తిగా నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నమేనని ఆయన విమర్శించారు.

ఈ సవరణల వల్ల ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్న సహకార సమాఖ్య వ్యవస్థ విధానం కూడా దెబ్బతింటుందని కామన్‌వెల్త్‌ మానవ హక్కుల కార్యకర్త వెంకటేశ్‌ నాయక్‌ హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన, ఇతర సమాచార కమిషనర్ల జీత భత్యాలను కేంద్రమే నిర్ణయిస్తుందంటే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హక్కులను కాలరాయడమే అవుతుందని ఆయన అన్నారు. కేంద్రం ఏ చట్టం, ఏ సవరణ బిల్లును తీసుకురావాలన్నా వాటిలోని ప్రతిపాదనలను ప్రజల ముందు విధిగా ఉంచాలని ‘ప్రీ లెజిస్లేటివ్‌ కన్సల్టెన్సీ పాలసీ–2014’ నిర్దేశిస్తోంది. ఇప్పుడు అందుకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం బిల్లులోని ప్రతిపాదనలను ఎంపీలకు మాత్రమే సర్కులేట్‌ చేసింది.

ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్ల జీత భత్యాలను చట్టమే నిర్దేశిస్తూ వచ్చింది. అందుకని వారు స్వతంత్య్రంగా వ్యవహరించేందుకు వీలు పడింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌ వేతనం, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సమానంగా ఉంటుందని, ఇతర సమాచార కమిషనర్ల వేతనం, ఇతర ఎన్నికల కమిషనర్లతో సమానంగా ఉంటుందని సమాచార చట్టం నిర్దేశిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనరల్‌ వేతనం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో సమానం, ఇతర రాష్ట్ర సమాచార కమిషనర్ల వేతనం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేతనంతో సమానంగా ఉంటుందని చట్టం చెబుతోంది. అలాగే పదవీ కాలాన్ని ఐదేళ్లు, పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లు నిర్దేశించింది. 2005 నాటి సమాచార హక్కు చట్టంలో సవరణ  తీసుకరావడం ఇది రెండోసారని, దీని వల్ల చట్టం పూర్తిగా నీరుగారి పోతుందని ‘నేషనల్‌ కాంపెయిన్‌ ఫర్‌ పీపుల్స్‌ రైట్‌ టు ఇన్‌ఫర్మేషన్‌’ సంస్థకు చెందిన అంజలి భరద్వాజ్‌ ఆరోపించారు. సమాచార చట్టం నుంచి రాజకీయ పార్టీలను మినహాయిస్తూ 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తొలిసారి సవరణ తీసుకొచ్చింది. ఆ సవరణ వల్ల రాజకీయ పార్టీలకు ఎక్కడి నుంచి నిధులు లేదా విరాళాలు వస్తున్నాయో, ఏ మొత్తంలో వస్తున్నాయో ప్రజలు తెలుసుకోవడానికి వీల్లేకుండా పోయింది.

మరిన్ని వార్తలు