కేసులు పెడతావా.. పరిహారం చెల్లించు

3 May, 2019 19:52 IST|Sakshi

పెప్సీకోపై మండిపడ్డ రైతు సంఘాలు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో బంగాళదుంపలు పండించిన రైతులపై పెట్టిన కేసులను పెప్సీకో బేషరతుగా ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. కేసుల పేరుతో అన్నదాతలను వేధించినందుకు తగిన పరిహారం చెల్లించాలని అన్నాయి. పెప్సికో కేసు నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు గుజరాత్‌లోని 25 రైతు సంఘాలతో పాటు భారతీయ కిసాన్‌ సంఘ్‌(బీఎస్‌కే), హక్కుల కార్యకర్తలు, ఎన్జీవోలు కలిసి ‘విత్తన సార్వభౌమాధికార జాతీయ ఫోరం’గా ఏర్పడ్డాయి. కార్యాచరణ ఖరారు చేసేందుకు శుక్రవారం అహ్మదాబాద్‌లోని గుజరాత్‌ విద్యాపీఠ్‌లో జాతీయ ఫోరం ప్రతినిధులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రైతు హక్కుల నేత కపిల్‌ షా విలేకరులతో మాట్లాడుతూ.. రైతులపై కేసులు ఉపసంహరించుకుంటామని పెప్సికో చేసిన ప్రకటనలో కొత్త విషయాలు లేవన్నారు. రెండు షరతుల మీద రైతులపై కేసులు వెనక్కు తీసుకుంటామని గతంలో కోర్టుకు పెప్సికో తెలిపిందన్నారు. తమ కంపెనీ కాంట్రాక్టు ఫార్మింగ్‌లో భాగస్వాములు కావడం లేదా తమ విత్తనాలు వాడటం మానేస్తేనే కేసులు ఉపసంహరించుకుంటామని కోర్టుకు పెప్సికో చెప్పిందన్నారు. బేషరతుగా కేసులు ఉపసంహరించి, రైతులకు పరిహారం చెల్లించాలని కపిల్‌ షా డిమాండ్‌ చేశారు. విత్తన వ్యాపారుల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని చట్టాలు చెబుతున్నాయని, ఈ విషయంలో ఎటువంటి సంప్రదింపులకు తావులేదన్నారు.

గుజరాత్‌లోని కొంతమంది రైతులు ఎఫ్‌సీ–5 రకం బంగాళదుంపలను పండించగా, ఆ రకం బంగాళదుంపలపై తమకు పంటరకం రక్షణ హక్కులు ఉన్నాయనీ, తమ అనుమతి లేకుండా వీటిని ఎవరూ పండించకూడదంటూ పెప్సీకో మొత్తం 11 మంది రైతులపై కేసు వేయడం తెలిసిందే. ఈ రకం బంగాళదుంపలను పెప్సీలో తమ లేస్‌ చిప్స్‌ తయారీకి వినియోగిస్తోంది. పెప్సీకో కేసు వేయడంతో మన దేశంలో రైతులు ఏం పండించాలో ఒక విదేశీ సంస్థ శాసించడం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తడంతో పెప్సీకో వెనక్కి తగ్గింది.

మరిన్ని వార్తలు