రితీష్‌ ఇక లేరు

14 Apr, 2019 10:16 IST|Sakshi

గుండెపోటుతో హఠాన్మరణం

నటుడిగా, మాజీ ఎంపీగా సుపరిచితుడు

డీఎంకే టూ అన్నాడీఎంకేతో రాజకీయ పయనం

చివరకు అనంతలోకాలకు..

రామనాథపురంలో భౌతిక కాయం

విషాదంలో పార్టీ వర్గాలు, మద్దతుదారులు, సినీ సన్నిహితులు

సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు దిగ్భ్రాంతి

సాక్షి, చెన్నై: సినీ నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ, అన్నాడీఎంకే నేత జేకే రితీష్‌ (46) శనివారం హఠాన్మరణం పొందారు. రామనాథపురంలోని ఇంట్లో గుండెపోటు రావడంతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రితీష్‌ మరణ సమాచారం మద్దతుదారులు, అన్నాడీఎంకే వర్గాలు, సినీ సన్నిహితుల్ని విషాదంలోకి నెట్టింది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం దిగ్భ్రాంతికి గురయ్యారు.

నటుడిగా జేకే రితీష్‌ తమిళనాట సుపరిచితుడే. 2009 లోక్‌సభ ఎన్నికల ముందు అనూహ్యంగా రాజకీయ తెరపైకి రితీష్‌ వచ్చారు. అప్పట్లో దక్షిణాది జిల్లాల డీఎంకే కింగ్‌ మేకర్‌గా ఉన్న అళగిరిని తన నేతగా రితీష్‌ ప్రకటించుకున్నారు. అళగిరి మద్దతుదారుడిగా, విశ్వాసపాత్రుడిగా మెలుగుతూ వచ్చిన రితీష్‌కు రామనాథపురం లోక్‌సభ సీటు దక్కింది. తన మద్దతుదారుల్ని అళగిరి గెలిపించుకున్నారు. పార్లమెంట్‌కు వెళ్లినా సరే, ఏదేని కార్యక్రమాలకు వెళ్లినా సరే అళగిరి వెన్నంటి రితీష్‌ ఉండే వారు. డీఎంకే నుంచి అళగిరి బహిష్కరణ వేటుకు గురి కావడం రితీష్‌ను జీర్ణించుకోలేకుండా చేసింది. తన నేత ఏమి చెబితే అదే చేస్తానని ఆ సమయంలో ప్రకటించిన రితీష్, ఎంపీగా పదవిలో ఉన్నప్పుడే డీఎంకే అధిష్టానానికి వ్యతిరేకంగా స్వరాన్ని పెంచారు. అధిష్టానం హెచ్చరించినా ఖాతరు చేయకుండా అళగిరి వెంట తిరిగారు. దీంతో ఆయన్ను డీఎంకే తొలగించింది.  

2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేను వీడిన రీతిష్‌ అమ్మ జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపు కోసం రామనాథపురంలో సుడిగాలి పర్యటన చేసి, అమ్మ మెప్పు పొందారు. అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకేలో విభేదాలు బయలుదేరినా, తాను మాత్రం పార్టీకే  విధేయుడ్ని అని ప్రకటించుకున్నారు. అన్నాడీఎంకేలో కొనసాగుతూ వచ్చిన రితీష్‌ ప్రస్తుతం రామనాథపురం ఎన్నికల ప్రచారంపై తీవ్రంగానే దృష్టి పెట్టారు. అక్కడ పోటీ చేస్తున్న అన్నాడీఎంకే  కూటమికి చెందిన బీజేపీ అభ్యర్థి నయనార్‌ నాగేంద్రన్‌కు మద్దతుగా ప్రచారం సాగిస్తున్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు శనివారం పరమకుడిలో ప్రచారం పూర్తి చేసి, ప్రధాని మోదీ ప్రచారసభకు వెళ్లేందుకు నిర్ణయించారు. అయితే, పరమకుడి ప్రచారంలో జాప్యం నెలకొనడం, అప్పటికే మోదీ సభ ముగియడంతో నేరుగా రామనాథపురంలోని తన ఇంటికి వెళ్లారు. 

భోజనం ముగించుకుని....
ప్రచారం ముగించుకుని ఇంటికి చేరుకున్న రితీష్, మద్దతుదారులు, సన్నిహితులతో, పార్టీ వర్గాలతో కాసేపు ముచ్చటించారు. అందరూ భోజనం చేసి రావాలని సూచించి లోనికి వెళ్లారు. తానూ భోజనం ముగించుకుని, విశ్రాంతి తీసుకున్నారు. సరిగ్గా మూడు గంటల సమయంలో చాతినొప్పిగా ఉందంటూ రితీష్‌ పెట్టిన కేకలతో సహాయకులు ఆయన గదిలోకి పరుగులు తీశారు. అప్పటికే ఆయన కుప్పకూలి ఉండడంతో హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు రితీష్‌ మరణించినట్టుగా «ధ్రువీకరించారు. రితీష్‌ మరణ సమాచారంతో రామనాథపురంలో విషాదచాయలు అలుముకున్నాయి. మద్దతుదారులు, అభిమానులు, పార్టీ వర్గాలు కన్నీటి పర్యంతం అయ్యారు. రితీష్‌ మృతదేహాన్ని ఆయన సొంత ఇంటికి తీసుకొచ్చి, ఆప్తులు, అభిమానులు, పార్టీ వర్గాల సందర్శనార్థం ఉంచారు. రితీష్‌ హఠాన్మరణ సమాచారంతో సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం దిగ్భ్రాంతికి గురయ్యారు.

రితీష్‌ మృత దేహానికి ఆదివారం అంత్యక్రియలు జరిగనున్నాయి. భార్య, బంధువులు, ఇతర కుటుంబీకులు చెన్నై నుంచి  రామనాథపురానికి బయలుదేరి వెళ్లారు. సీని నటీ నటుల సంఘం అధ్యక్షుడు నాజర్‌ పేర్కొంటూ, రితీష్‌ మరణ సమాచారం షాక్‌కు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. నడిగర్‌ సంఘం ఎన్నికల సమయం నుంచి తనకు రితీష్‌తో పరిచయం ఉన్నదని, అభిప్రాయ భేదాలు ఉన్నా, మంచి నిర్వాహకుడు అని, రాజకీయాల్లో చురుగ్గా ఉన్నా, ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వాడని,అయితే, ఇప్పుడు హఠాన్మరణం పొందడం తీవ్ర వేదనకు గురి చేస్తున్నదన్నారు. ఎమ్మెల్యే, నటుడు కరుణాస్‌ పేర్కొంటూ, తిరువాడనైలో తన గెలుపు కోసం రితీష్‌ ఎంతో శ్రమించారని, అందుకే ఆయన్ను తన సోదరుడిగా భావించే వాడినన్నారు. తన కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోయినంత వేదన కల్గుతోందన్నారు. దర్శకుడు విజయ్‌ కార్తిక్‌ పేర్కొంటూ మంచి మిత్రుడ్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించే మిత్రుడు , భుజం తట్టి ప్రోత్సహించే శ్రేయోభిలాషిని కోల్పోయానని విలపించారు. 

శ్రీలంక నుంచి తమిళ రాజకీయాల్లోకి.....
శ్రీలంకలోని కండి ప్రాంతంలో కులందై వేల్, జయలక్ష్మి దంపతులకు 1973 మార్చి ఐదున ముగవై కుమార్‌ అలియాస్‌ జేకే  రితీష్‌ జన్మించారు. ఆ తదుపరి ఆయన కుటుంబం శ్రీలంకను వీడి రామనాధపురంలో స్థిర పడింది. ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన రితీష్‌ కష్ట పడి పైకొచ్చిన వ్యక్తి. రియల్‌ ఎస్టేట్, కాంట్రాక్టులు, భవన నిర్మాణ రంగం అంటూ ముందుకు సాగి, కొన్ని దేశాల్లోనూ తన వ్యాపార సామాజ్య్రాన్ని విస్తరించి ఉన్నారు. సినిమాల మీద మక్కువ ఎక్కువే కావడంతో  ఆ దిశగా కూడా ప్రయత్నించి, మంచి నటుడిగా గుర్తింపు పొందారు. చిన్న పిళ్‌లై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైనా, కథానాయకుడిగా 2007లో కన్నాల్‌ నీర్‌ చిత్రంలో అందరి దృష్టిలో పడ్డారు.

2008లో విడుదలైన నాయగన్‌ చిత్రంతో తనకంటూ అభిమాన లోకాన్ని సొంతం చేసుకున్నారు. సేవ కార్యక్రమాలతో ముందుకు సాగి డిఎంకేతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2009లో డిఎంకే లోక్‌ సభ అభ్యర్థిగా రామనాధపురం నుంచి గెలిచారు. 2010లో డిఎంకేఅధినేత కరుణానిధి కథ, మాటలు అందించిన పెన్‌ సింగం చిత్రంలో నటించి ప్రశంసలు అందుకున్నారు. ఆ తదుపరి కొన్ని చిత్రాల్లో నటించినా, చివరి చిత్రం ఇటీవల విడుదలైన ‘ఎల్‌కేజీ’. ఈ చిత్రంలో రితీష్‌ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక, కొన్ని వివాదాల్లో రితీష్‌ మీద కేసులు సైతం ఉన్నాయి. ఇక, నిర్మాతల మండలి, నడిగర్‌ సంఘంలో విశాల్‌కు వ్యతిరేకంగా దూకుడుగా వ్యవహరించి ఉన్నారు.  ప్రస్తుతం రామనాధపురంలో బిజేపి అభ్యర్థి నయనార్‌ నాగేంద్రన్‌ను గెలిపించాలన్న కాంక్షతో ప్రచారంలో దూసుకెళ్లిన రితీష్‌ గుండె పోటుతో అనంత లోకాలకు వెళ్లారు. ఆయనకు భార్య జ్యోతిశ్వరి, కుమారుడు ఆరిక్‌ రోషన్‌లు ఉన్నారు.  

మరిన్ని వార్తలు