నటుడు, మాజీ ఎంపీ రితీష్‌ హఠాన్మరణం

13 Apr, 2019 18:03 IST|Sakshi
జేకే రితీష్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, చెన్నై: ప్రముఖ నటుడు, మాజీ ఎంపి జేకే రితీష్ (46) శనివారం గుండెపోటుతో కన్నుమూశారు.  రామనాధపురంలోని ఆయన నివాసంలో ఈరోజు మధ్యాహ్నం గుండెపోటు రావటంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రితేష్‌ మృతి చెందారు. నాలుగు తమిళ చిత్రాల ద్వారా హీరోగా సుపరిచితమైన రితీష్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. డిఎంకె పార్టీ నుండి 2009 లోక్ సభ ఎన్నికల్లో రామనాధపురం ఎంపిగా ఉన్న రితీష్ గడిచిన ఎన్నికలకు ముందు అన్నాడిఎంకెలో చేరారు. నడిగర్ సంఘం, నిర్మాతల మండలి ఎన్నికల్లో నటుడు విశాల్ బృందం‌ విజయానికి కృషి చేసిన రితీష్ ఇటీవల వాటికి దూరంగా ఉంటూ వచ్చారు.

ఆయన ప్రదాన భూమికలో నటించిన ఎల్‌కేజీ ఇటీవలే విడుదలై మంచి ప్రశంసలు పొందగా కొద్దిరోజులుగా కుటుంభంతో రామనాధపురంలో ఉంటున్నారు. శ్రీలంకలో పుట్టిన తమిళుడైన ఆయన పూర్వికులు రామనాధపురం కావటంతో అక్కడే ఉంటున్నారు. రితేష్‌ ఇంట్లో సేద తీరుతుండగా గుండెపోటు రావటంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం నివాసంలో ఉంచారు. ఆదివారం రితీష్ బౌతికకాయానికి రామనాడులోనే అంత్యక్రియలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు