యూనివర్సిటీలో ఆదర్శ కోడలు సర్టిఫికేట్‌

14 Sep, 2018 16:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: విశ్వ విద్యాలయాల్లో వివిధ కోర్సులు ప్రవేశపెట్టడం చూస్తునే ఉన్నాం. కానీ వాటన్నంటికి భిన్నంగా మధ్యప్రదేశ్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం ఓ కొత్త కోర్సును తీసుకురావడానికి ముందుకొచ్చింది. కొత్తగా పెళ్లైన అమ్మాయిలు అత్తగారి ఇళ్లలో ఎలా నడుచుకోవాలో తెలిపేందుకు ఆదర్శ్‌ బాహు(సంస్కారవంతమైన కోడలు) పేరుతో కోర్సును ప్రవేశపెట్టనుంది. మూడు నెలల వ్యవధితో కూడిన ఈ కోర్సు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. మహిళల్లో సాధికారత పెంపొందిచడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

దీనిపై యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ మాట్లాడుతూ.. ‘పెళ్లైన తర్వాత అమ్మాయిలు ఓ కొత్త వాతావరణంలోకి అడుగుపెడతారు. అక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవడం.. అందుకు తగ్గట్టుగా నడుచుకోవడం వారికి తొలుత కష్టతరంగా ఉంటుంది. అందుకోసమే మేము ఈ కోర్సును ప్రవేశపెట్టనున్నాం. మాకు సమాజం పట్ల బాధ్యత ఉంది.. అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ కోర్సులో సోషియాలజీ, సైకాలజీతో పాటు కుటుంబ విలువలు, బంధాల గురించి యువతులకు తెలియజేస్తాం. తొలి బ్యాచ్‌లో 30 మంది యువతులను ఈ కోర్సులో చేర్చుకుంటాం. దీని ద్వారా సమాజంలో మంచి మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. కోర్సు పూర్తిచేసుకున్నాక తాము ఆదర్శ్‌ బాహు పేరిట సర్టిఫికేట్‌ను అందజేస్తామ’ని తెలిపారు.

కాగా దీనిని కొంతమంది విద్యావేత్తలు వ్యతిరేకిస్తున్నారు. ముందు బర్కతుల్లా యూనివర్సిటీ విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంతో పాటు, తరగతులు, పరీక్షలు సక్రమంగా నిర్వహించడంపై దృష్టి సారించాలని అంటున్నారు. 
 

>
మరిన్ని వార్తలు