వారు 15 ఏళ్ల పోరాటంలో సాధించినదేమిటీ?

20 Feb, 2018 17:36 IST|Sakshi
భూమి హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలపై పోలీసు తూటాలు

సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో భూమి హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలపై పోలీసు తూటాలు పేలి 16 మంది ఆదివాసీలు మరణించిన సంఘటనకు సోమవారం నాటికి సరిగ్గా 15 ఏళ్లు. ఆ నాటి సంఘటనలో వినోద్‌ అనే పోలీసు అధికారి మరణించడంతోపాటు వందలాది మంది ఆదివాసీలు గాయపడ్డారు. వరుసగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఆదివాసీలకు భూమి హక్కులు కల్పిస్తామంటూ హామీలు ఇవ్వడం, నెరవేర్చక పోవడం పట్ల విసిగెత్తిన కేరళ ఆదివాసీలు 'ఆదివాసీ గోత్ర మహాసభ' పేరిట ఏకమయ్యారు. ఈ మహాసభ బ్యానర్‌ కింద కే. గీతానందన్, సీకే జాను అనే యువకులు వేలాది మంది ఆదివాసీ కుటుంబాలను సమీకరించి 2003, ఫిబ్రవరి 19వ తేదీన నిరసన ప్రదర్శన జరిపారు. 

కేరళ జనాభాలో ఆదివాసీలు కేవలం 1.1 శాతం, అంటే 3.6 లక్షల మంది ఉన్నారు. వారంతా వేయనాడు, పలక్కాడ్, ఇదుక్కి, పట్టణంతిట్ట, కొల్లాం, తిరువనంతపురం జిల్లాల్లోని అటవి ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకొని బతుకుతుండేవారు. 1970 దశకం నుంచి వారి నుంచి భూములు ఆదివాసేతరులకు అన్యాక్రాంతం అవుతూ వచ్చాయి. దాంతో అనేక ఆదివాసీ కుటుంబాలు వ్యవసాయానికి దూరమై పస్తులతో అవస్థలు పడసాగారు. 1975లో తిరిగి వారి భూములను వారికి వెనక్కి ఇచ్చేస్తామంటూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ చట్టాన్ని అమలు చేయడంలో సీపీఎం నాయకత్వంలోని లెఫ్ట్‌ అండ్‌ డెమోక్రటిక్‌ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ నాయకత్వంలోని యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ప్రభుత్వం విఫలమయ్యాయి. 

2001లో రాష్ట్రమంతా ఓనం సందర్భంగా ప్రజలు పండుగ జరుపుకుంటుంటే 30 మంది ఆదివాసీలు ఆకలితో చనిపోయారు. దాంతో జాను అనే యువకుడి ఆధ్వర్యంలో భూమి హక్కుల కోసం పోరాడేందుకు ఆదివాసీ దళిత కార్యాచరణ సమితి ఏర్పడింది. అదే ఆ తర్వాత ఆదివాసీ గోత్ర మహాసభగా మారింది. దళిత కార్యాచరణ సమితి ఆధ్వర్యాన వేలాది మంది ఆదివాసీలు తిరువనంతపురం వెళ్లి అక్కడి సీఎం కార్యాలయం ముందు గుడిశెలు వేసి 48 గంటలపాటు ఆందోళన నిర్వహించారు. భూమిలేని ఆదివాసీలకు ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు భూమి ఇస్తామని సీఎం కార్యాలయం స్పష్టమైన హామీ ఇవ్వడంతో అప్పుడు ఆందోళనను విరమించారు. మరో రెండేళ్లు గడిచిపోయినా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. 

2003, ఫిబ్రవరి నెలలో వేలాది మంది ఆదివాసీలు తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని ముతంగా అటవీ ప్రాంతాన్ని ఆక్రమించుకొని స్వయం పాలన ప్రకటించారు. భూమిని దున్నడం మొదలు పెట్టారు. వారిని అటవి నుంచి ఖాళీ చేయించేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు. ఆ నాటి సంఘటనల్లో ఒక ఆదివాసి, ఓ పోలీసు అధికారి మాత్రమే మరణించారని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించగా 16 మంది ఆదివాసీలను చంపేశారని ఆదివాసీ నాయకులు ఆరోపించారు. తమను కూడా పోలీసు స్టేషన్లో నిర్బంధించి తీవ్రంగా హింసించారని జాను, గీతానందన్‌లు నాడు ఆరోపించారు. 2014లో మరోసారి ఆదివాసీలు ఆందోళన చేశారు. కేంద్రం ప్రభుత్వం ఆధీనంలోని 19,600 అటవి భూములను పంచడంతోపాటు వారి డిమాండ్లన్నింటిని పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆదివాసీలు తమ 162 రోజుల ఉద్యమాన్ని నిలిపివేశారు. మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేక పోయింది.
 
2016, కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాను ఆధ్వర్యంలో ఆదివాసీ గోత్ర మహాసభలోని ఓ వర్గం చీలిపోయింది. ఆమె తన వర్గానికి జనాధిపత్య రాష్ట్రీయ సభగా నామకరణం చేసి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయోలో చేరారు. మరోవర్గానికి గీతానందన్‌ నాయకుడిగా ఉండిపోయారు. ఆదివాసీ పోరాటం సందర్భంగా జానును జాతి వ్యతిరేక శక్తిగా, ఆదివాసీలను పరమతంలోకి మారుస్తోందని ఆరోపించిన బీజేపీనే ఆ తర్వాత ఆమె వర్గాన్ని ఎన్డీయోలో చేర్చుకోవడం విశేషం. నాడు ఆందోళనలో పాల్గొన్న 283 కుటుంబాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు భూములు లభించాయి. ఇంకా వేలాది మంది ఆదివాసీ కుటుంబాలకు న్యాయం జరగాల్సి ఉంది. అయితే తాము నిర్వహించిన ఆందోళన ద్వారా ఆదివాసీల్లో పోరాట స్ఫూర్తి పెరిగిందని, ఆ స్ఫూర్తితోనే అందరికి భూములు లభించే వరకు పోరాటం కొనసాగిస్తామని జాను 15వ వార్షికోత్సవం సందర్భంగా మీడియాకు తెలిపారు. 

తమ పోరాటం ద్వారా అందరికి భూములు లభించక పోయినప్పటికీ ప్రభుత్వం ప్రణాళిక రూపకల్పనలో తమను భాగస్వాములను చేస్తున్నారని, అది తాము సాధించిన విజయమేనని గీతానందన్‌ చెప్పారు. పోలీసు అధికారిన చంపారంటూ 180 మంది ఆదివాసీలపై పెట్టిన కేసులో ఇంకా విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, జోగి అనే ఆదివాసీని పోలీసులు చంపారన్న కేసులో ఇంకా దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు