యవ్వనంలో ముగుస్తున్న ఆదివాసీ జీవితం.!

13 Apr, 2018 08:53 IST|Sakshi

దేశంలోని ఇతర సామాజికవర్గాలతో పోల్చితే ఆదివాసీలు, షెడ్యూల్డ్‌ కులాలు, అల్పసంఖ్యాక వర్గాలు (ముస్లింలు) ముందుగానే మృత్యువాత పడుతున్నారు. ఇతర వర్గాల ప్రజలతో పోల్చితే సరైనస్థాయిలో వైద్యసేవలు అందక క్షీణిస్తున్న ఆరోగ్యాల కారణంగా చిన్నవయసులోనే చనిపోతున్నారు. భారత్‌లోని నిచ్చెన మెట్ల సమాజంలో  అట్టడగున ఉన్న అణగారిన వర్గాలపై ఈ ప్రభావం అధికంగా ఉన్నట్టు తేలింది. ఉన్నత తరగతులు, ముస్లీమేతర వర్గాలకు చెందిన వారితో పోల్చి చూస్తే ఈ వర్గాలకు సరైన  వైద్య,ఆరోగ్య సేవలు అందడం లేదని ‘భారత్‌లో కులం, మతం, ఆరోగ్యాలపై ప్రభావం (2004–14 మధ్యకాలంలో)’ పై ఆర్థికవేత్త వాణీæకాంత్‌ బారువా జరిపిన విశ్లేషణలో వెల్లడైంది.

2004 నుంచి 2014 వరకు పరిశీలిస్తే  ఆదివాసీల సగటు జీవితకాలం తగ్గిపోయింది.. 2004 వరకు ఎస్టీలు సగటును 45 ఏళ్లపాటు జీవిస్తుండగా, ఆ తర్వాతి దశకంలో అది మరింత తగ్గిపోయింది.  ఎస్సీల సగటు జీవితకాలం 42 నుంచి 2014 కల్లా ఆరేళ్లు పెరిగింది. మొత్తం ఆరుగ్రూపుల్లో ముస్లీమేతర ఉన్నత కుటుంబాల సగటు జీవించే వయసు  2004లో 55 ఏళ్ల నుంచి 2014లో 66 ఏళ్లకు పెరిగింది. దీనికి ఆరోగ్య,వైద్యసేవల నిర్వహణలో లోపాల కారణంగా తలెత్తుతున్న అసమానతలే ప్రధాన కారణమని బారువా తేల్చారు. భారత్‌లో ఓ వ్యక్తి ఆరోగ్యస్థితి నిర్థారణకు అతడు/ఆమె ఆర్థిక, సామాజిక స్థాయి సారూప్యపాత్ర (రిలేటివ్‌ రోల్‌) నిర్వహిస్తోందంటారు. 2004, 2014లలోని నేషనల్‌ శాంపిల్‌  సర్వే ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) గణాంకాల ఆధారంగా ఆయన వివిధ అంశాలు పరిశీలించారు. 

2004, 2014లలో సామాజిక బృందాల వారీగా  సగటు వయసు మరణాలు...
                                                         2004         2014
ముస్లీమేతర ఉన్నత వర్గాల వయసు            55            60                
ముస్లీమేతర ఓబీసీలు                               49            52
ఉన్నత వర్గ ముస్లింలు                              44            49
షెడ్యూల్డ్‌ కులాలు                                    42            48
షెడ్యూల్డ్‌ జాతులు                                   45            43
 

ఇతర సామాజికవర్గాలతో పోల్చితే ఎస్టీలు తక్కువ వయసులోనే చనిపోతున్నా, తాము అనారోగ్యంగా ఉన్న విషయాన్ని 24 శాతం మాత్రమే వెల్లడిస్తున్నారు. 2004లో ఇది 19 శాతంగానే ఉంది.  ముస్లింలు, ఓబీసీలు 35 శాతం మంది వైద్య సేవల కోసం బయటకు వస్తున్నారు. పేదలు, ఒంటరిగా ఉంటున్న వారు తమ ఆరోగ్య సమస్యలు వెల్లడించి వైద్యసేవలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బారువా పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు