కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ అద్నాన్‌ సమీ

27 Jan, 2020 14:49 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ గాయకుడు, మ్యూజిషియన్‌ అద్నాన్‌ సమీకి పద్మశీ అవార్డు ఇవ్వడంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు చేస్తోంది. పాకిస్తాన్‌లో పుట్టి పెరిగిన అద్నాన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ ప్రతినిధి జైవీర్‌ షర్గిల్‌ తప్పుబట్టారు. కార్గిల్‌ యుద్ధంలో పోరాడిన మహ్మద్‌ సన్నావుల్లాను ఎన్నార్సీ అనంతరం విదేశీయుడిగా ప్రకటించిన కేంద్రం.. పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌ కుమారుడికి పద్మశ్రీ అవార్డును ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం చంచాగిరి మ్యాజిక్‌ వల్లే అద్నాన్‌కు పద్మశ్రీ వచ్చిందని వ్యాఖ్యానించారు.

కాగా తనపై కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలకు అద్నాన్‌ ఘాటుగా స్పందించారు. ‘హేయ్‌ కిడ్‌.. మీ బుద్దిని క్లియరెన్స్‌ సేల్‌  నుంచి తెచ్చుకున్నారా.. లేక సెకండ్‌ హ్యాండ్ షాప్‌ నుంచి కొనుకున్నారా. తల్లిదండ్రుల చర్యలకు పిల్లలు ఎలా బాధ్యులవుతారు. మీరు ఒక న్యాయవాది. లా స్కూల్‌లో మీరు ఇదే నేర్చుకున్నారా’’ అంటూ ట్వీటర్‌ వేదికగా మండిపడ్డారు.

మరోవైపు కాంగ్రెస్‌ నేతల వాదనకు భిన్నంగా ఆ పార్టీ సీనియర్‌నేత దిగ్విజయ్‌ సింగ్‌ మాత్రం అద్నాన్‌కు అభినందనలు తెలిపారు. దేశంలో అత్యున్నత పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 141 మందికి పద్మ అవార్డులు ప్రకటించగా అందులో అద్నాన్‌ సమీ ఒకరు. ఈ ఏడాదికి గాను మొత్తం 141 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేయగా.. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్ వరించగా, 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మ శ్రీ అవార్డు వరించాయి.

మరిన్ని వార్తలు