'రథ'క్షేత్రంలో..

10 Nov, 2019 03:20 IST|Sakshi

రామ్‌ రథయాత్రకు నేతృత్వం వహించిన అద్వానీ

దేశవ్యాప్తంగా భారీ స్పందన; ఏకీకరణకు ఊతం

రామ్‌ రథయాత్ర.. 1990 సెప్టెంబర్‌ నుంచి 1992 డిసెంబర్‌ 6 వరకూ దేశాన్ని రాజకీయంగా, సామాజికంగా తీవ్ర కుదుపునకు గురిచేసిన అద్వానీ యాత్ర. బీజేపీ రూపురేఖలను మార్చి ఆ పార్టీ స్వర్ణయుగానికి నాంది పలకడమే కాకుండా, రాజకీయ ముఖచిత్రం మార్పునకూ దారితీసిన కీలక ఘటన.  

‘మండల్‌’ మంత్రాన్ని అడ్డుకోవడం
1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తరువాత, ఆమె తనయుడు రాజీవ్‌గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో 411 సీట్లతో కాంగ్రెస్‌ భారీ మెజారిటీ సాధించింది. ఐదేళ్లు తిరిగేసరికి బోఫోర్స్‌ సహా పలు ఆరోపణలతో 1989లో కాంగ్రెస్‌ పరాజయం పాలైంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మ్యానిఫెస్టోలో చేర్చిన బీజేపీ ఆ ఎన్నికల్లో 86 సీట్లు సాధించింది. వీపీ సింగ్‌కు మద్దతివ్వటంతో ఆయన నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ కొలువు తీరింది. ప్రభుత్వోద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ కల్పించడానికి ఉద్దేశించిన మండల్‌ కమిషన్‌ నివేదికను 1990 ఆగస్టు 7న సింగ్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అగ్రవర్ణాలు భగ్గుమన్నాయి. దీన్నో అవకాశంగా తీసుకుంది బీజేపీ. ఫలితమే 1990 సెప్టెంబర్‌ 12 అద్వానీ రథయాత్ర ప్రకటన. రాముడి జన్మ స్థలమైన అయోధ్యలో ఆలయం నిర్మాణానికి దేశవ్యాప్తంగా మద్దతుని కూడగట్టాలన్నది ఈ రథయాత్ర సంకల్పమని బీజేపీ ప్రకటించుకుంది. 1990 సెప్టెంబర్‌ 25న గుజరాత్‌లోని సోమనాథ్‌ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్రకు అద్వానీ నేతృత్వం వహించారు.

భారీ స్పందన
రోజుకు 300 కిలోమీటర్లు సాగిన ఈ రథయాత్ర గుజరాత్‌లోని 600 గ్రామాలను తాకుతూ సాగింది. ఇది ఎంత భావోద్వేగపూరితంగా సాగిందంటే.. జెట్‌పూర్‌ అనే గ్రామంలో  హిందూత్వ వాదులు ఒక మగ్గునిండుగా తమ రక్తాన్ని అద్వానీకి బహూకరించేంత.! గుజరాత్‌ తరవాత మహారాష్ట్రలోకి అడుగుపెట్టిన యాత్రకు శివసేన సంపూర్ణ మద్దతునిచ్చింది. తరవాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో సాగింది. ఢిల్లీ నుంచి ఉత్తర ప్రదేశ్‌ సరిహద్దులు దాటిన వెంటనే అద్వానీని అరెస్టు చేయాల్సిందిగా నాటి ప్రధాని వీపీ సింగ్‌ బిహార్‌ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌కి సూచించారు. అక్టోబర్‌ 23న అద్వానీని, నాటి వీహెచ్‌పీ అధినేత అశోక్‌ సింఘాల్‌ను ప్రభుత్వం అరెస్టు చేసింది. 

రాజకీయ విజయమే.!
ఈ పరిణామాన్ని రాజకీయ కోణంలో చూస్తే... అద్వానీ అక్టోబర్‌ 23న అరెస్ట్‌ అయిన వెంటనే బీజేపీ మద్దతు ఉపసంహరణతో అటు వీపీ సింగ్‌ నేతృత్వంలోని నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం, ఇటు లాలూ ప్రసాద్‌ నేతృత్వంలోని బిహార్‌ ప్రభుత్వం కుప్పకూలాయి. 1990 నవంబర్‌ 7న సింగ్‌ ప్రభుత్వం లోక్‌సభ విశ్వాసాన్ని కోల్పోయింది. కాంగ్రెస్‌ మద్దతుతో చంద్రశేఖర్‌ ప్రధాని కాగా.. 16 నెలలకే దిగిపోయారు. మళ్లీ ఎన్నికలొచ్చాయి.

రాజీవ్‌ హత్య జరక్కపోతే...!
10వ లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయానికి బీజేపీ సిద్ధమైనట్లే కనబడింది. మండల్‌– మసీదు అంశాలే ప్రధాన ప్రచారాస్త్రాలుగా నిలిచాయి. మొదటి దఫా ఎన్నికలు పూర్తయిన మే 20వ తేదీ మర్నాడే తమిళనాడులో ఒక ఎన్నికల బహిరంగ సభలో ఆత్మాహుతి దాడిలో రాజీవ్‌గాంధీ ప్రాణాలు కోల్పోయారు. దీనితో తర్వాతి ఎన్నికల తేదీలు జూన్‌ మధ్య వరకూ వాయిదా పడ్డాయి. జూన్‌ 12, 15 తేదీల్లో తదుపరి దశ జరిగాయి. తొలి విడత 211 సీట్లకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ అతికొద్ది స్థానాలనే దక్కించు కోగలిగింది. జూన్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు తగిన సీట్లను సంపాదించి పెట్టాయి. ఫలితం కేంద్రంలో పీవీ నరసింహారావు నేతృత్వంలో మైనారిటీ సంకీర్ణం ఏర్పడింది. రాజీవ్‌ హత్య జరగకపోతే, 1991లోనే అద్వానీ ప్రధాని అయ్యేవారన్నది కొందరి విశ్లేషణ.   

మరిన్ని వార్తలు