అద్వానీకి సతీ వియోగం

7 Apr, 2016 01:30 IST|Sakshi
అద్వానీకి సతీ వియోగం

గుండెపోటుతో  కమలా అద్వానీ మృతి
 
 న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ సతీమణి కమలా అద్వానీ (83) గుండెపోటుతో కన్నుమూశారు. ఊపిరాడక అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను బుధవారం సాయంత్రం ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కొంతకాలంగా వీల్‌చైర్‌పైనే ఉంటున్నారు. మతిమరుపుతోనూ సతమతమయ్యారు. అద్వానీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన వెన్నంటి ఉన్నప్పటికీ ఆమె రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. తన ఉత్థానపతనాల్లో మద్దతుగా నిలిచిన ఆమె తుదిశ్వాస విడిచినప్పుడు అద్వానీ పక్కనే ఉన్నారు.కమలను సాయంత్రం 5.10 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని, గంటపాటు చికిత్స అందించినప్పటికీ  6.10 గంటలకు ఆమె మృతిచెందారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.  రాత్రికి కమల భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ప్రధాని మోదీతోపాటు పెద్దఎత్తున రాజకీయ నేతలు తరలి వచ్చి నివాళులు అర్పించారు.  అంత్యక్రియలను  గురువారం సాయంత్రం 4 గంటలకు నిగమ్ బోధ్ ఘాట్‌లో  నిర్వహించనున్నారు. 1965లో వివాహమైన అద్వానీ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.  కమల కొన్నాళ్లు పోస్టాఫీసులోనూ విధులు నిర్వర్తించారు. 90ల్లో అద్వానీ తన రాజకీయ జీవితంలో కీలకమైన రథయాత్ర నిర్వహించినప్పుడు కూడా కమల ఆయన వెన్నంటి ఉన్నారు.   

 రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
 కమల మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మోదీలతోపాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృదుస్వభావి అయిన కమల సంస్కృతికి ప్రతీక అని ప్రణబ్ కొనియాడారు. ఆమె మృతి ఎంతగానో కలచివేసిందంటూ మోదీ ఆమెతో జరిపిన సంభాషణలను గుర్తుచేసుకున్నారు. ఆమె పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సోనియా అన్నారు. గువాహటిలో ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్.. అద్వానీకి ఫోన్ చేసి సంతాపం తెలిపారు. అద్వానీకి తోడుగా ఆదర్శ జీవితాన్ని గడిపిన ఆమె తమకందరికీ ప్రేమమూర్తిగా నిలిచారని ఆరెస్సెస్ నేత దత్తాత్రేయ హొసబలే పేర్కొన్నారు.

 వైఎస్ జగన్ సంతాపం
 సాక్షి, హైదరాబాద్: కమలా అద్వానీ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. సతీమణిని కోల్పోయి దుఃఖంలో ఉన్న అద్వానీకి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మరిన్ని వార్తలు