పాకిస్తాన్‌ ఆర్మీదే పైచేయి

21 Nov, 2017 08:33 IST|Sakshi
భారత ఆర్మీ వద్ద ఉన్న యాంటీ ట్యాంకు క్షిపణి (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్‌తో 500 మిలియన్ల డాలర్ల భారీ రక్షణ ఒప్పందాన్ని భారత్‌ ఉప సంహరించుకుంది. ఈ ఒప్పందం రద్దుతో భారత ఆర్మీ ఆశలు ఆవిరయ్యాయి. శత్రు దేశాల యుద్ధ ట్యాంకర్లను, బంకర్లను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్‌తో 'స్పైక్‌ క్షిపణుల' ఒప్పందాన్ని భారత్‌ చేసుకుంది. పాకిస్తాన్ ఆర్మీ వద్ద మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో గల ట్యాంకర్లు, బంకర్లు నాశనం చేయగల సామర్ధ్యం గల క్షిపణులు ఉన్నాయి.

అయితే, ఇజ్రాయెల్‌తో ఒప్పందం తర్వాత పాక్‌ కంటే శక్తిమంతమైన క్షిపణులు మనకు సమకూరుతాయని భారతీయ ఆర్మీ భావించింది. ప్రస్తుతం కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్యాంకర్లను నాశనం చేయగల మిస్సైల్స్‌ మాత్రమే మన వద్ద ఉన్నాయి.

చైనానే పాక్‌కు ఇచ్చింది..
యుద్ధ ట్యాంకులను తునాతునకలు చేయగల శక్తమంతమైన చైనీస్‌ హెచ్‌జే-8 మిస్సైల్‌ను చైనా పాకిస్తాన్‌కు అందించింది. వీటికి పాకిస్తాన్ భక్తర్‌ అనే పేరు పెట్టుకుంది. అంతేకాకుండా హెచ్‌జే-8 కంటే మరింత సామర్ధ్యం గల అమెరికాకు చెందిన టీఓడబ్ల్యూ క్షిపణులు కూడా పాకిస్తాన్‌ అమ్ములపొదిలో ఉన్నాయి. వీటి రేంజ్‌ నాలుగు కిలోమీటర్ల పైమాటే.

భారత్‌ వద్ద ఉన్నవి ఇవే..
యుద్ధ ట్యాంకులను, బంకర్లను నాశనం చేయగల క్షిపణులు భారత ఆర్మీ వద్ద కూడా ఉన్నాయి. ఫ్రెంచ్‌-జర్మన్‌కు చెందిన మిలన్‌ 2టీ, రష్యా నుంచి కొనుగోలు చేసిన కొన్‌కర్స్‌ మిస్సైల్స్‌లు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోని వాటిని మాత్రమే నాశనం చేయగలవు.

స్పైక్‌ క్షిపణి ప్రత్యేకత ఇదే..
స్పైక్‌ క్షిపణులను ప్రయోగించడానికి ఒక జవాను చాలు. కదిలే లక్ష్యాలను కూడా ఇది చేధించగలదు. క్షిపణిని ప్రయోగించిన వెంటనే జవానులు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి కూడా స్పైక్‌ మిస్సైల్స్‌ అవకాశం కల్పిస్తాయి.

ఎందుకీ అర్థాంతర రద్దు..?   
ఇజ్రాయెల్‌  నుంచి కొనుగోలు చేయాలని భావించిన స్పైక్‌ యాంటి ట్యాంక్‌ మిస్సైళ్ల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని భారత్‌ నిర్ణయించింది. ఈ తరహా క్షిపణుల్ని దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసే బాధ్యతను రక్షణరంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు అప్పగించింది. మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్పైక్‌ క్షిపణుల సాంకేతికతను పూర్తిస్థాయిలో భారత్‌కు బదిలీ చేసేందుకు ఇజ్రాయెల్‌ వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

ఈ తరహా క్షిపణుల రూపకల్పనకు డీఆర్‌డీవోకు నాలుగేళ్ల గడువు ఇచ్చినట్లు వెల్లడించాయి. ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్, భారత్‌కు చెందిన కళ్యాణి గ్రూప్‌ స్పైక్‌ మిస్సైళ్లను రూపొందించడానికి హైదరాబాద్‌లో రూ.70 కోట్లతో ఉత్పత్తి కేంద్రాన్ని ఆగస్టులో ప్రారంభించాయి.

మరిన్ని వార్తలు