ఆనందీబెన్ వారసుడెవరు?

3 Aug, 2016 07:11 IST|Sakshi
ఆనందీబెన్ వారసుడెవరు?

తెరపైకి నితిన్ పటేల్, రూపానీ, కేంద్రమంత్రి పురుషోత్తం
అహ్మదాబాద్: గుజరాత్ సీఎంగా ఆనందీబెన్ పటేల్ రాజీనామా ప్రకటనతో ఆమె స్థానాన్ని ఎవరితో భర్తీచేస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. బుధవారం ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆనందీబెన్ పటేల్ రాజీనామాను ఆమోదించటంతోపాటు కొత్త సీఎంనూ ప్రకటించే అవకాశాలున్నట్లు తెలిసింది. సీఎం రేసులో పలువురు ముఖ్యనేతల పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. గుజరాత్ ఆరోగ్య మంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర బీజేపీ చీఫ్ విజయ్ రూపానీ, సౌరభ్ పటేల్, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా, అసెంబ్లీ స్పీకర్ గణపత్ వసావా (గిరిజన నాయకుడు) జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నితిన్‌భాయ్ పటేల్‌కు పార్టీలో మంచి పట్టుంది. దీనికి తోడు మోదీ పీఎం అయ్యాక.. గుజరాత్ సీఎం రేసులో నితిన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే.. పటేల్ సామాజిక వర్గానికి చెందినవాడైనా ఆ వర్గం యువత ఈయనపై పూర్తి వ్యతిరేకతతో ఉండటం.. నితిన్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. జైన్ వర్గానికి చెందిన రాష్ట్ర బీజేపీ చీఫ్ రూపానీకి మోదీ, అమిత్ షాతోపాటు ఆరెస్సెస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని వర్గాలను కలుపుకుపోతారని ఈయనకు పేరుంది.

గుజరాత్ ఇంధన మంత్రి సౌరభ్ పటేల్ పేరు కూడా సీఎం రేసులో వినబడుతోంది. ఈయన.. అంబానీ సోదరులకు దగ్గరి బంధువు. కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా, స్పీకర్ గణపత్ వసావాలకూ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే.. గుజరాత్ బీజేపీ కార్యకర్తలు మాత్రం అమిత్ షా సీఎం అయితే.. పార్టీకి రాష్ట్రంలో ఎదురవుతున్న చిన్నాచితకా సమస్యలను అధిగమించవచ్చని భావిస్తున్నారు. కాగా, బీజేపీ సీఎంగా ఆనందీబెన్ పటేల్‌ను తొలగించటం.. ఆమెను బలిపశువును చేయటమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.

మరిన్ని వార్తలు