‘దాణా’పై లాలూకు చుక్కెదురు

9 May, 2017 01:59 IST|Sakshi
‘దాణా’పై లాలూకు చుక్కెదురు

► దాణా స్కామ్‌లో నాలుగు కేసులను
► వేర్వేరుగా విచారించాలి: సుప్రీంకోర్టు
► తొమ్మిది నెలల్లో విచారణ ముగించాలని ఆదేశం


న్యూఢిల్లీ: దాణా కుంభకోణానికి సంబం ధించి రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్‌జేడీ) చీఫ్, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగి లింది. ఈ స్కామ్‌కు సంబంధించిన నాలుగు కేసుల్లో లాలూ వేర్వేరుగా విచా రణ ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశిం చింది. లాలూపై నేరపూరిత కుట్ర అభియో గాలను కొట్టేస్తూ జార్ఖండ్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పక్కన పెట్టింది.

లాలూతో పాటు మిగిలిన నిందితులపై విచారణ ప్రక్రియను తొమ్మిది నెలల్లో పూర్తి చేయాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ అమితవరాయ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. లాలూ బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాణా కుంభకోణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పశువులకు దాణా కొనుగోలు చేసే నెపంతో రూ.900 కోట్లను పశుసం వర్థక శాఖ నుంచి అక్రమంగా విత్‌డ్రా చేశారు. దీనిపై సీబీఐ కేసులు నమోదు చేసింది.స్కామ్‌లో లాలూతో పాటు బిహార్‌ మాజీ సీఎం జగన్నాథ్‌మిశ్రా, బిహార్‌ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సజ్జల్‌ చక్రవర్తి తదితరులు నిందితులుగా ఉన్నారు.

దాణా కుంభకోణానికి సంబంధించి ఒక కేసులో లాలూ దోషిగా నిర్ధారణ కావడంతో మిగతా కేసుల్లో ఆయనపై విచారణను నిలుపుదల చేస్తూ 2014లో జార్ఖండ్‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టిన సుప్రీంకోర్టు.. కేసు విచారణలో ఒకేవిధంగా స్పందించాలని, ఒకే కేసులో ఒకే వ్యక్తికి సంబంధించి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం తగదని స్పష్టం చేసింది. ఈ కేసులో సీబీఐ తీరునూ అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది.

హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అప్పీలు దాఖలు చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడాన్ని ప్రశ్నించింది. అత్యంత కీలకమైన ఈ కేసుపై సీబీఐ డైరెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. ఈ కేసును పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించింది. మరోవైపు  సుప్రీం ఆదేశాలను బీజేపీ సీనియర్‌ నాయకుడు సుశీల్‌కుమార్‌ మోదీ స్వాగతిం చారు. ఈ తీర్పుతో రాజకీయాల్లో లాలూ శకం ముగిసినట్టే అని అన్నారు. మిగిలిన మూడు కేసుల్లోనూ లాలూకు శిక్ష పడటం ఖాయమని, దీంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా మరిన్ని సంవత్సరాలు వేటుపడే అవకాశం ఉందన్నారు.

మరిన్ని వార్తలు