అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేకు అవమానం

30 Jul, 2018 17:55 IST|Sakshi
ధ్రుమ్‌ రుషి ఆలయం- ఎమ్మెల్యే మనీషా అనురాగి

లక్నో : ఆలయాలు ప్రైవేటు ఆస్తులు కావని, మహిళలను ఆలయంలోకి రాకుండా ఆడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు (శబరిమల ఆలయం గురించి) ఇటీవలే తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎన్ని తీర్పులు వచ్చినా, సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా తమ నమ్మకాలను వదులుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. ఉత్తరప్రదేశ్‌లోని ముస్కారా ఖుర్ద్‌ గ్రామస్తులు కూడా ఆ కోవకు చెందిన వారే. తామెంతో నిష్ఠగా కొలుచుకునే ధ్రుమ్‌ రుషి ఆలయంలోకి ఓ మహిళ ప్రవేశించడంతో అపచారం జరిగిపోయిందని ఆగ్రహించారు. కానీ సదరు మహిళ అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఏం చేయలేక.. ఆమె వెళ్లిపోగానే ఆలయ సంప్రోక్షణ చేసి, విగ్రహాలను ప్రయాగకు పంపించి మరీ గంగాజలంతో శుద్ది చేయించారు.

అసలేం ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని రాత్‌ నియోజక వర్గ ఎమ్మెల్యే మనీషా అనురాగి(బీజేపీ) తన పర్యటనలో భాగంగా జూలై 12న ముస్కారా ఖుర్ద్‌ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సమీపంలోని ధ్రుమ్‌ రుషి ఆలయాన్ని సందర్శించాలంటూ పార్టీ కార్యకర్తలు పట్టుబట్టారు. అయితే ఆ ఆలయంలోకి మహిళలకు అందులోనూ దళితులకు ప్రవేశం లేదని పూజారి, గ్రామస్తులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కార్యకర్తల ఒత్తిడితో ఆమెను ఆలయంలోకి అనుమతించక తప్పలేదు.

పూజలు నిర్వహించడంతో పాటు, రుషి ధ్యానం చేసుకున్న ప్రదేశంలో మనీషా కాలు పెట్టారని, ఇక తమ గ్రామానికి కీడు తప్పదని గ్రామస్తులంతా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పూజారులచే ఆలయాన్ని శుద్ధి చేయించి, విగ్రహాలను ప్రయాగకు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ మహిళ అందులోనూ దళిత వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించడంతో గ్రామస్తులు ఆందోళన చెందారని, వారి భయాన్ని పోగొట్టేందుకే ఇలా చేశామని హమీర్పూర్‌ పంచాయతీ పెద్దలు తెలిపారు. తమ నియమాలను, ఆచారాలను మంటగలిపాలని చూస్తే సహించలేమని పేర్కొన్నారు.

ఆలయ నేపథ్యం..
మహాభారత కాలానికి చెందినదిగా ప్రాశస్త్యం పొందిన ధ్రుమ్‌ రుషి ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్‌ జిల్లాలోని ముస్కారా ఖుర్ద్‌ గ్రామంలో ఉంది. ఆలయ నిబంధనల ప్రకారం.. మహిళలు ఆలయ పరిసరాల్లో తిరిగినా, కనీసం గోడలను తాకినా ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని గ్రామస్తులు విశ్వసిస్తారు.

మరిన్ని వార్తలు