మరో గోరఖ్‌పూర్‌ ఘటన రిపీట్ కానివ్వొద్దు

19 Aug, 2017 14:15 IST|Sakshi
మరో గోరఖ్‌పూర్‌ ఘటన రిపీట్ కానివ్వొద్దు
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతం. బుందేల్‌ఖండ్‌ ప్రాంతం ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఒకే ఒక్క ఆస్పత్రి వైపు పరుగులు తీస్తారు. 700 పడకల పెద్ద ఆస్పత్రి అది. అలాంటిది సమస్యలకు మాత్రం నిలయంగా ఉంది. ముఖ్యంగా గోరఖ్‌పూర్‌ ఘటన తరహా ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా లేమి ఇక్కడ  కూడా దర్శనమిస్తోంది. 
 
బాబా రాఘవ దాస్ ఆస్పత్రి ఉదంతం అనంతరం మహారాణి లక్ష్మి బాయి కాలేజీ ఆస్పత్రి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్డీ ఆస్పత్రి మాదిరిగానే ఇక్కడా ఆస్పత్రి యాజమాన్యం సిలిండర్ల సరఫరా కంపెనీకి బకాయిలు ఉన్నారు. అయితే గోరఖ్‌పూర్‌ ఉదంతం అనంతరం అప్రమత్తమై రంగంలోకి దిగిన అధికారులు హుటాహుటినా కంపెనీకి రూ. 36 లక్షలను చెల్లించేశారు. 
 
ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే... ఆస్పత్రి, కంపెనీ ఒప్పందం ఈ యేడాది మార్చికే పూర్తయిపోయినప్పటికీ వాళ్లు ఇంకా సిలిండర్ల సరఫరాను కొనసాగించటమే. మరోపక్క టెండర్లు నిర్వహించాల్సిన ఆస్పత్రి వర్గాలు కూడా నిబంధనలను పెడ చెవిన పెట్టేశాయి. ఆస్పత్రికి రోజుకు 120 నుంచి 150 సిలిండర్ల అవసరం ఉండగా, కేవలం 25 నుంచి 50 సిలిండర్లను మాత్రమే వాళ్లు సరఫరా చేయగలుగుతున్నారు. సిలిండర్లు సప్లై చేస్తున్న గౌరీ గ్యాస్ కంపెనీ చాలా చిన్నది కావటంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతుందని ఇదే ఆస్పత్రిలో సేవలు అందించిన రిటైర్డ్ వైద్యుడు ఒకరు తెలిపారు. ఇలాంటి సమయంలో బీఆర్డీ ఆస్పత్రి మాదిరి జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. 
 
అయితే తాను 18 ఏళ్లుగా  ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నానని, ఖరగ్‌పూర్‌ ఘటన మాదిరి పరిస్థితులు ఇక్కడేం కనిపించలేదని విధులు నిర్వహిస్తున్న మరో వైద్యుడు చెబుతున్నాడు. కానీ, రోగుల అనుభవాలు మాత్రం భయానకంగా ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి ఆయింట్ మెంట్ పూయటం తప్ప వేరే చికిత్స చేయకపోవటం, రైలు నుంచి కింద పడి గాయపడ్డ ఓ బాలుడికి  స్ట్రెచ్చర్ కూడా అందించకపోవటం లాంటి పరిస్థితులు అక్కడ దర్శనమిచ్చాయి.  
 
యూపీతోపాటు మధ్యప్రదేశ్ నుంచి ఏడు జిల్లాల ప్రజలు నిత్యం ఇక్కడకు చికిత్స కోసం వస్తుంటారు. యూపీలో దాదాపు ప్రతీ ఆస్పత్రిలో ఇలాంటి పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల జాప‍్యం, అరకోర సిబ్బంది వంటి సమస్యలే ప్రజలకు మెరుగైన వైద్యాన్ని దూరం చేస్తున్నాయి. కనీసం ఇప్పుడు విమర్శల నేపథ్యంలోనైనా ప్రభుత్వాలు సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటే గోరఖ్‌పూర్‌ తరహా మృత్యు ఘోషలు పునరావృతం కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వార్తలు