మోదీలా ఊయల ఊగలేను!

11 Jul, 2017 01:01 IST|Sakshi
మోదీలా ఊయల ఊగలేను!

► చైనా, భూటాన్‌ రాయబారులతో భేటీపై రాహుల్‌ వ్యాఖ్య
► కీలక పరిణామాలు తెలుసుకోవడం నా బాధ్యత: రాహుల్‌
► రాహుల్‌ భేటీ వివరాల్ని బయటపెట్టాలన్న బీజేపీ


న్యూఢిల్లీ:
భారత్‌లోకి చైనా సైనికులు చొరబడ్డ సమయంలో ఆ దేశ అధ్యక్షుడితో కలసి ప్రధాని మోదీ ఊయల్లో విహరించారని, తాను అలాంటి వ్యక్తిని కాదని రాహుల్‌ గాంధీ విమర్శించారు. సిక్కిం సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. జూలై 8న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ చైనా, భూటాన్‌ రాయబారుల్ని  కలిశారన్న విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ భేటీ తీవ్ర చర్చనీయాంశం కావడంపై ఆయన స్పందిస్తూ..  ముఖ్యమైన అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకోవడం తన బాధ్యత అని ట్వీట్‌ చేశారు.

‘నేను చైనా రాయబారి, మాజీ జాతీయ భద్రతా సలహాదారు, ఈశాన్య రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలు, భూటాన్‌ రాయబారిని కలిశాను. చైనా రాయబారిని కలవడంపై మీరు అంతగా ఆందోళన చెందుతుంటే.. ప్రస్తుతం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా ముగ్గురు కేంద్ర మంత్రులు ఎందుకు చైనాలో అధికారికంగా పర్యటిస్తున్నారో చెప్పండి?’ అని రాహుల్‌ ప్రశ్నించారు. జూలై 8న తమ దేశ రాయబారిని రాహుల్‌ గాంధీ  కలిశారని చైనా రాయబార కార్యాలయం తన అధికారిక వెబ్‌సైట్‌ పేర్కొంది. ప్రస్తుత భారత్‌–చైనా సంబంధాలపై ఇద్దరూ చర్చించుకున్నారని అందులో వెల్లడించింది. అయితే సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఈ వార్తను తొలగించారు.  రాహుల్‌ భేటీని కాంగ్రెస్‌ పార్టీ కూడా అధికారికంగా ధ్రువీకరించింది.

ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘ఇది మర్యాదపూర్వక భేటీ.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు విదేశీ రాయబారుల్ని అప్పుడప్పుడు కలవడం మామూలే’నని వివరణ ఇచ్చారు. ఈ భేటీకి అంత ప్రాధాన్యం లేదని.. జీ5 సభ్య దేశాలైన చైనా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా ప్రతినిధుల్ని కూడా గతంలో కాంగ్రెస్‌ నేతలు కలిశారని తెలిపారు. చైనా రాయబారి ల్యుయో ఝావోహ్యుయ్, భూటాన్‌ రాయబారి వెట్సాప్‌ నమ్‌గ్యేల్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివ శంకర్‌ మీనన్‌లను రాహుల్‌ కలిశారని, ఇది చాలా సాధారణ విషయమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు దేశ ప్రయోజనాల పట్ల పూర్తి జాగరూకతతో ఉన్నారని, సరిహద్దుల్లో ఉద్రిక్తతపై ఆందోళన చెందుతున్నారన్నారు.

ఏం మాట్లాడారు: బీజేపీ
చైనా రాయబారిని రాహుల్‌ కలవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే భేటీలో ఏ మాట్లాడుకున్నారో ఆయన బయటపెట్టాలని బీజేపీ ప్రతినిధి విజయ్‌ చౌతాయ్‌వాలే డిమాండ్‌చేశారు. సమావేశం వివరాల్ని దాచిపె ట్టారని, అందువల్ల కాంగ్రెస్‌ నేతల దేశభక్తిపై సందేహాలు తలెత్తుతున్నాయని, ఈ విషయంపై వివరణ ఇవ్వాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కోరారు

మరిన్ని వార్తలు