ఉల్లి బాటలో టమాట..

9 Oct, 2019 20:09 IST|Sakshi

న్యూఢిల్లీ : ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తుంటే తాజాగా టమాట కూడా మోతెక్కిస్తోంది. కర్ణాటక సహా టమాట దిగుబడులు అధికంగా ఉండే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా బుధవారం దేశ రాజధానిలో కిలో టమాట రూ 80కి ఎగబాకింది. సరఫరాలు తగ్గడంతో గత ఐదు రోజులుగా టమాట ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్‌ వర్తకులు టమాటాను రూ 60 నుంచి రూ 80 మధ్య విక్రయిస్తుండగా, మదర్‌డైరీ సఫల్‌ అవుట్‌లెట్లలో కిలో రూ 58కి విక్రయిస్తున్నారు. అక్టోబర్‌ 1న రూ 45 పలికిన కిలో టమాట బుధవారం సగటు రిటైల్‌ ధర రూ 54కు పెరిగిందని అధికారులు తెలిపారు. వరదలు, భారీ వర్షాలతో పంట దెబ్బతినడం, సరఫరా అవాంతరాలతో టమాట ధరలు మండుతున్నాయని ఆజాద్‌పూర్‌ మండిలో హోల్‌సేల్‌ ట్రేడర్‌ చెప్పుకొచ్చారు. ఇతర మెట్రో నగరాలు కోల్‌కతాలో కిలో టమాట రూ 60 కాగా, ముంబైలో రూ 54, చెన్నైలో రూ 40 వరకూ పలుకుతోంది.

మరిన్ని వార్తలు