’పనామా దోషులు’ ఎప్పటికి చిక్కేను?

9 Apr, 2016 14:24 IST|Sakshi

న్యూఢిల్లీ: పనామా లీకుల్లో వెలుగులోకి వచ్చిన భారతీయుల డాక్యుమెంట్లపై దర్యాప్తు జరిపేందుకు బహుళ సంస్థలను ఆదేశించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దర్యాప్తుకు ఎంత కాలం పడుతుంది? ఎప్పటిలోగా పూర్తవుతుంది? దోషులెవరు, ఎవరు కాదు? తేలడానికి ఎంత సమయం పడుతుంది? మొత్తానికి దోషులకు శిక్ష పడుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు సమాజాన్ని తొలుస్తున్నాయి. దోషులు ఎవరో తేలడానికి కొన్ని సంవత్సరాలేకాదు, కొన్ని యుగాలే పడుతుందని, దర్యాప్తు ప్రక్రియ నిరంతరం కూడా కొనసాగవచ్చని న్యాయ నిపుణలు అంటున్నారు.

 ‘వేల సంఖ్యలో వున్న డాక్యుమెంట్లను పరిశీలించి దర్యాప్తు జరపడానికి సంవత్సరాలు పడుతుంది. ఆ డాక్యుమెంట్లు నకిలీవని, ఫోర్జరీ చేశారని నిందితులు వాదించవచ్చు. అప్పుడు డాక్యుమెంట్ల అథెంటిసిటీని రుజువు చేయడానికి ఏళ్లు పడుతుంది. అనంతరం డాక్యుమెంట్ల ఆధారంగా డబ్బు లావాదేవీలను కనుగొనేందుకు యుగాలు పడుతుంది. ఆ తర్వాత అప్పీళ్ల మీద అప్పీళ్లు కొనసాగుతూనే ఉంటాయి’ అని దుష్యంత్ అరోరా, కాలమిస్ట్ తెలిపారు.

‘విదేశాల్లో కంపెనీలు, షేర్లు, అకౌంట్లు కలిగి ఉండడం 2004లో తీసుకొచ్చిన సరళీకరణ చట్టం ప్రకారం నేరం కాదు. వాటి వివరాలను ఆర్బీఐకి తెలియజేయక పోవడం నేరం. ఈ నేరానికి ఫెమా, ఫెరా చట్టాల కింద విచారించవచ్చు. డబ్బులు వచ్చిన సోర్స్ గురించి తెలియజేయకపోతే ఆదాయం పన్ను కింద విచారించవచ్చు. హెచ్ఎస్బీసీ లీక్స్లో భారతీయుల అక్రమ ఖాతాల వివరాలు వెలుగులోకి వచ్చినా వాటిని ప్రభుత్వం ప్రజల ముందుంచలేదు. సుప్రీం కోర్టు వేసిన సిట్ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఎవరికి శిక్ష పడలేదు. పెద్ద వాళ్లకు సంబంధించిన వ్యవహారాల్లో అధికారంలోవున్న ప్రభుత్వాలు మెతక వైఖరి అవలంబించడం జరుగుతోంది’ అని సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు.

2011లో వెలుగులోకి వచ్చిన హెచ్ఎస్బీసీ డాక్యుమెంట్లలో మొత్తం 569 ఎంటిటీలను గుర్తించారు. వాటిలో 390 ఎంటిటీలు అక్రమమైనవని తేల్చారు. 154 ప్రాసిక్యూషన్లను దాఖలు చేశారు. వాటి విచారణ ఇప్పటికీ నత్తనడకలాగా సాగుతోంది. అంతెందుకు 2007లో వెలుగు చూసిన ‘లీక్టెస్టైన్’ డాక్యుమెంట్లలోనే ఇప్పటికీ దోషులెవరో తేలలేదు. విచారణ కొనసాగుతూనే ఉంది.  ప్రశాంత్ భూషణ్ చెబుతున్నట్టుగా పనామా పత్రాల్లో భారతీయుల పేర్లు ఉన్నంత మాత్రాన వారు నేరం చేశారనడానికి వీలు లేదు.

 

విదేశీ కంపెనీలు, డబ్బు లావాదేవీలకు సంబంధించి 1990 దశకంలో ఓసారి, 2004లో ఓసారి భారత ప్రభుత్వం సరళీకరణ చట్టాలు తీసుకొచ్చింది. 2004 చట్టం ప్రకారమైతే ఓ భారతీయుడు విదేశాల్లో ఏడాదికి 2.5 లక్షల డాలర్ల లావాదేవీలు స్వేచ్ఛగా జరపొచ్చు. అనుమానితులు చట్టప్రకారమే లావాదేవీలు జరిపినట్లయితే వాటి వివరాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదుగదా. తాము ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని బాలివుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, ఐశ్యర్యరాయ్లు పత్రికా ముఖంగా చెబుతున్నారు. అలాంటప్పుడు వారి విదేశీ కంపెనీల గురించి, షేర్ల గురించి ముందే వెల్లడించి ఉండవచ్చుగదా! అలా ఎందుకు చేయలేదు.

పైగా పనామా లీక్స్ లో వెలుగులోకి వచ్చిన పత్రాలు 1977 కాలం నాటి నుంచి ఉన్నాయి. భారత సరళీకరణ చట్టాలను తీసుకరాకముందు విదేశీ కంపెనీల వ్యవహారాలు నిర్వహించిన వారు కచ్చితంగా దోషులే అవుతారు. ఎందుకంటే అప్పటి డాక్యుమెంట్లకు ఇప్పటి చట్టాలు వర్తించవు. డాక్యుమెంట్లు ఏ కాలం నాటివో, ఆ నాటి చట్టం ఏం చెబుతుందో అన్న అంశాలను కూడా దర్యాప్తు సంస్థలు పరిగణలోకి తీసుకొని కేసుల విచారణ కొనసాగించాల్సి ఉంటుంది. ఈ కారణంగా కూడా విచారణలో ఎంతో జాప్యం జరుగుతుంది.

>
మరిన్ని వార్తలు