పనామా ఎఫెక్ట్: 'బ్రాండ్' నుంచి బిగ్ బీ ఔట్!

19 Apr, 2016 21:20 IST|Sakshi
పనామా ఎఫెక్ట్: 'బ్రాండ్' నుంచి బిగ్ బీ ఔట్!

ముంబై/న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించి, ఒకటిరెండు దేశాల్లో ప్రభుత్వాలను సైతం కూలదోసింది పనామా పేపర్ల లీకేజీ వ్యవహారం. ఆ సమాచారాన్నిబట్టి పన్ను ఎగ్గొట్టి నల్లధనాన్ని విదేశాలకు విదేశాలకు తరలించిన 500 మంది భారతీయుల్లో సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఒకరు. అయితే ఆ వార్తలను ఖండించిన అమితాబ్ 'నా పేరును తప్పుగా వాడి ఉంటారు' అని ప్రకటించారు. అంతటితో సమస్య సమసిపోలేదు..

పనామా పేపర్లలో పేరు వెల్లడయినందుకు అమితాబ్ బచ్చన్ భారీ మూల్యం చెల్లించుకోనున్నారా? తప్పుచేయలేదన్నబింగ్ బీ ప్రకటనతో కేంద్రప్రభుత్వం సంతృప్తి చెందలేదా? అందుకే ఆయనను ఇంకా చేపట్టని ఇంక్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ హోదా కోల్పోనున్నారా? గడిచిన కొద్ది గంటలుగా జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలివి. ఇంక్రెడిబుల్ బ్రాండ్ హోదాను అమితాబ్ కు కట్టబెట్టే విషయంలో కేంద్రం పునరాలోచనలో పడిందని, మరో సెలబ్రిటీని ఆ హోదాలో నియమించనుందని పలు సంస్థలు వార్తలు ప్రచారం చేశాయి. వీటిపై బిగ్ బీ కూడా ఘాటుగానే స్పందించారు.

'నిజానికి ఆ హోదా (ఇంక్రెడిబుల్ ఇండియా బ్రాండ్అంబాసిడర్)లో కొనసాగమని నాన్నెవరూ సంప్రదించలేదు. అంబాసిడరేకాని నన్ను ఆ హోదా నుంచి తొలిగించారని మీడియాలో వార్తలు రావటం విడ్డూరం'అని అమితాబ్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మీడియా ఊహాగాలు విన్నతర్వాత స్పష్టత ఇచ్చేందుకే ఈ ప్రకట చేస్తున్నట్లు బచ్చన పేర్కొన్నారు. పనామా పేపర్ల వ్యవహారంపై స్పందిస్తూ తాను నేరం చేసిందీ లేనిదీ తేల్చాల్సింది చట్టమేకాని, మీడియా కదని, ఏదో తప్పు జరిగినందువల్లే అమితాబ్ ను బ్రాండ్ హోదా నుంచి తొలిగించారని ప్రచారం చేయటం సరికాదన్నారు.

విదేశీ టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ ప్రారంభించిన 'ఇంక్రెడిబుల్ ఇండియా' ప్రచారానికి మొదట్లో ఆమిర్ ఖాన్ అంబాసిడర్ గా ఉన్నారు. అసహనంపై వ్యాఖ్యల అనంతరం ఆమిర్ ను తప్పించిన కేంద్ర ఆ హోదాను అమితాబ్ కు కట్టబెట్టాలనుకుంది. అయితే అధికారికంగా తుదినిర్ణయం ఇంకావెలువడాల్సిఉంది. అంతలోనే పనామా పేపర్లలో బిగ్ బితోపాటు ఆయన కోడలు ఐశ్వర్య పేరు వెలుగులోకి రావటంతో కేంద్రం పునరాలోచనలో పడ్డట్టు సమాచారం.

మరిన్ని వార్తలు