మోదీ దెబ్బకు రేప్‌ ఆరోపణల మంత్రి మాయం

20 Feb, 2017 19:04 IST|Sakshi
మోదీ దెబ్బకు రేప్‌ ఆరోపణల మంత్రి మాయం

అమేథి: ప్రధాని నరేంద్రమోదీ చేసిన విమర్శలు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌పై వెంటనే ప్రభావం చూపించాయి. సోమవారం అమేథిలో ప్రచారానికి వెళ్లిన అఖిలేశ్‌ లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ మంత్రి గాయత్రి ప్రజాపతి ఉన్న వేదికను పంచుకోలేదు. అంతేకాదు, ప్రచారంలో ఆయన పేరును కూడా ఉపయోగించకుండానే ప్రజలను ఓట్లు అడిగారు. తొలుత సభావేదికపైనే గాయత్రి ప్రజాపతి ఉన్నప్పటికీ అఖిలేశ్‌ వచ్చే సమయంలో మాత్రం అక్కడి నుంచి మాయమయ్యారు. ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళతాయనే కారణంతోనే అఖిలేశ్‌ ఆయనను దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది.

తనపై, తన మైనర్‌ కూతురుపై ప్రజాపతి ఆయన సమూహం లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ కేసులు పెట్టింది. ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కేసులు పెట్టేందుకు నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. అనంతరం కోర్టు ఆదేశించిన తర్వాతే కేసు నమోదు చేశారు. ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది.

అంతకుముందు అక్రమ మైనింగ్‌లకు పాల్పడ్డాడని కూడా ప్రజాపతిపై ఆరోపణలు ఉ‍న్నాయి. రేపిస్టులను స్వేచ్ఛగా వదిలేశారు. న్యాయంకోసం మహిళలు సుప్రీంకోర్టు తలుపులు తడుతున్నారు. మీరు ఏం పనిచేస్తున్నారు అఖిలేశ్‌ జీ?మీ మంత్రి(ప్రజాపతి) లైంగిక దాడి కేసులో ఉన్నాడు. మీరు వెళ్లి ఆయన తరుపున ప్రచారం చేస్తున్నారు. ఇది చేయాల్సిన పని కాదు’ అని ప్రధాని మోదీ ఘాటుగా విమర్శించారు. ఈ నేపథ్యంలో సోమవారంనాటి ప్రచారంలో అఖిలేశ్‌ తన మంత్రిని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు