దాడులపై ఇంత అలక్ష్యమా?

10 Mar, 2017 01:05 IST|Sakshi
దాడులపై ఇంత అలక్ష్యమా?

అమెరికాలోని భారతీయులపై జాత్యహంకార దాడుల పట్ల లోక్‌సభలో విపక్షాలు ధ్వజం
► ప్రధాని మౌనంపై ప్రశ్నాస్త్రాలు
► వచ్చే వారం ప్రకటన చేస్తామని హోం మంత్రి వెల్లడి

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ మలివిడత బడ్జెట్‌ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. లోక్‌సభ జీరో అవర్లో అమెరికాలో భారతీయులపై దాడులను చర్చించారు. అలాగే లక్నో ఎన్‌కౌంటర్, ఉగ్రవాదుల అరెస్టుపై హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటన చేశారు. పార్లమెంట్‌ సమావేశాలు ఏప్రిల్‌ 12తో ముగుస్తాయి. అమెరికాలో భారతీయులపై వరుసగా జరుగుతున్న జాత్యహంకార దాడులపై లోక్‌సభలో విపక్ష ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీలు ఈ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారంటూ వారు ప్రశ్నించారు.ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక అమెరికాలో విద్వేషపూరిత నేరాలు పెరిగాయంటూ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.  అమెరికాలో విద్వేషపూరిత దాడులపై ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాల్ని స్పీకర్‌ తిరస్కరించడంతో జీరో అవర్లో విపక్ష ఎంపీలు ఆ అంశాన్ని లేవనెత్తారు. ఇలాంటి సందర్భాల్లో పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక ఉందో సభకు వెల్లడించాలని వారు డిమాండ్‌ చేశారు.

అమెరికాతో ఈ అంశంపై చర్చించడంలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. దాడుల్ని ఖండించడంలో గాని, అమెరికాతో ఉన్నత స్థాయిలో సమస్య పరిష్కారానికి కృషిచేయడంలో గానీ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ‘మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది. ప్రతి అంశంపై మోదీ వరుస ట్వీట్లు చేస్తారు, ఇంత తీవ్ర అంశంపై ఎందుకు స్పందించడం లేదు’ అని ఖర్గే ప్రశ్నించారు. విదేశీ నేతల్ని కౌగిలించుకుంటూ, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌తో కలసి ఊయల ఊగుతూప్రధాని కనిపిస్తుంటారని వ్యంగ్యా స్ర్తాలు సంధించారు.

అమెరికాలోని భారతీయుల ప్రయోజనాల్ని పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సౌగత్‌ రాయ్‌ ఆరోపించారు. ఎంతో వాగ్ధాటి గల ప్రధానమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అమెరికాలో సురక్షితం కాని ప్రదేశాల గురించి పేర్కొంటూ సలహాలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని, అమెరికా వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక జారీచేయాలని బీజేడీ ఎంపీ భర్తృహరి మహతబ్‌ కోరారు.

వీటికి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమాధానమిస్తూ.. భారతీయులపై దాడుల్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. విదేశాల్లోని భారతీయులు తాము భద్రంగా ఉన్నామని భావించేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ అనారోగ్యంతో ఉన్నారని గుర్తుచేస్తూ... ఈ అంశంపై వచ్చేవారం లోక్‌సభలో విస్పష్ట ప్రకటన చేస్తామని చెప్పారు. అంతకుముందు జీరో అవర్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని, వాటిని పార్లమెంట్‌కు వెల్లడించాలని, అలాగే అమెరికా ప్రభుత్వంతో చర్చించాలని ఆయన కోరారు. మరికొన్ని పార్టీలకు చెందిన ఎంపీలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

రాజ్యసభ వాయిదా
ఇటీవల సిట్టింగ్‌ ఎంపీ హజీ అబ్దుల్‌ సలాం మరణించడంతో ఆయనకు నివాళిగా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. మాజీ సభ్యులు రబీరే, పి.శివశంకర్, పి.రాధాకృష్ణ, సయ్యద్‌ షాబుద్దీన్ ల మృతికి కూడా రాజ్యసభ సంతాపం తెలిపింది.

ఎన్ ఐఏకు అనుమానిత ఉగ్ర కేసులు: రాజ్‌నాథ్‌
లక్నో ఎన్ కౌంటర్‌తో పాటు అనుమానిత ఉగ్రవాద కేసుల్ని ఎన్ ఐఏకు అప్పగించామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. బుధవారం లక్నోలో జరిగిన కాల్పుల్లో అనుమానిత ఉగ్రవాది మహమ్మద్‌ సైఫుల్లా హతమయ్యాడని, అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో పోలీసులు ఆరుగురు అనుమానితుల్ని అరెస్టు చేశారని ఆయన లోక్‌సభకు తెలిపారు.

ఇరు రాష్ట్రాల పోలీసులు సరైన సమయంలో స్పందించి జాతీయ భద్రతకు పెద్ద ముప్పును తప్పించారని పేర్కొన్నారు. ఇదంతా రాష్ట్ర పోలీసులు, కేంద్ర నిఘా సంస్థల మధ్య అద్భుతమైన సహకారంతోనే సాధ్యమైందన్నారు. ‘నా కొడుకు దేశానికి విధేయంగా ఉండకపోతే, మాకెలా విధేయంగా ఉంటాడు’ అని సైఫుల్లా తండ్రి మహమ్మద్‌ సర్తాజ్‌ చెప్పడాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించగా, సభ్యులు బల్లలు చరిచి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు