'ప్రత్యేక ముంబై'పై క్షమాపణా చెప్పేదేలేదు: శోభా డే

1 Aug, 2013 22:57 IST|Sakshi
'ప్రత్యేక ముంబై'పై క్షమాపణా చెప్పేదేలేదు: శోభా డే
ప్రత్యేక రాష్ట్రంగా ముంబైని ఎందుకు ఏర్పాటు చేయకూడదంటూ తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై క్షమాపణ అడిగే ప్రసక్తే లేదని ప్రముఖ రచయిత్రి శోభా డే గురువారం స్పష్టం చేశారు. ముంబైని మహారాష్ట్ర నుంచి వేరుచేయాలని తాను సూచించలేదని, ట్విట్టర్‌లో తాను పొందుపర్చిన వ్యాఖ్యలను అర్థం చేసుకోకుండా క్షమాపణలు చెప్పాలని పట్టుబడితే పట్టించుకోనంటూ వ్యంగంగా మాట్లాడారు. సరదాగా చేసిన వ్యాఖ్యలకు ఇలా స్పందిస్తారని ఊహించలేదని, దిన పత్రికల్లో విషయం చూసి అవాక్కయ్యానన్నారు. తాను ఎవరి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించలేదని, తానెవరినీ బాధపెట్టలేదని, దీంతో క్షమాపణ అడిగే ప్రశ్నే తలెత్తదని శోభా డే శివసేన, ఎమ్మెన్నెస్‌లకు సమాధానమిచ్చారు. 
 
 మద్యం మత్తులో మాట్లాడుతోంది: శివసేన
 శోభా వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన శివసేన, ఎమ్మెన్నెస్ పార్టీలు ఆందోళనను మరింత తీవ్రం చేశాయి. ఆమె మద్యం మత్తులో మాట్లాడుతోందని, ముంబైని విడదీయడమంటే భర్తతో విడాకులు తీసుకున్నంత తేలికేమి కాదంటూ పరోక్షంగా చురకలంటించారు. ఆమెను అరెస్టు చేయాలని శివసేన డిమాండ్ చేసింది. క్షమాపణలు చెప్పాల్సిందేనని, లేదంటే తమ ఆందోళన మరింత తీవ్రమవుతుందని హెచ్చరించింది. ఎమ్మెన్నెస్ కూడా గొంతు కలిపింది.  
మరిన్ని వార్తలు