హనుమాన్‌ విగ్రహంపైనా దుండగుల ఆగ్రహం

9 Mar, 2018 08:54 IST|Sakshi
ఫైల్‌ఫోటో

లక్నో : లెనిన్‌, పెరియార్‌, మహాత్మా గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాలపై దాడుల ఘటనలు మరువక ముందే యూపీలో కొందరు దుండగలు హనుమాన్‌ విగ్రహాన్ని కూల్చివేసిన ఘటన వెలుగుచూసింది. బలియా సమీపంలోని ఖరూవ్‌ గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నెలకొల్పిన హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహంపై దుండగులు ఓ పోస్టర్‌ను అతికించారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్‌ స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి నిందితులను అరెస్ట్‌ చేస్తామని పోలీసులు చెప్పారు. హనుమాన్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల స్ధానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు దశాబ్ధం కిందట సురేష్‌ సింగ్‌ తన పొలంలో చనిపోయిన వానరాన్ని గుర్తించిన క్రమంలో అక్కడ హనుమాన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి స్ధానికులు అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు.

విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై తీవ్ర చర్యలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్న ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి పరాజయం నేపథ్యంలో త్రిపురలో తొలుత లెనిన్‌ విగ్రహాన్ని బుల్డోజర్‌ సాయంతో కూల్చివేసిన ఘటన కలకలం రేపింది. ఇక తమిళనాడులోని తిరుపత్తూర్‌లో ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్‌ ఈవీ రామస్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.

ఈ ఘటనకు సంబంధించి బీజేపీ, సీపీఐకి చెందిన ఇద్దరు కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. ఇదే ఒరవడిలో పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జన్‌సంఘ్‌ వ్యవస్ధాపకులు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ విగ్రహాన్ని, యూపీలోని మీరట్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. చివరికి మహాత్మా గాంధీ విగ్రహాన్నీ దుండగులు విడిచిపెట్టలేదు. కేరళలోని కన్నూర్‌ జిల్లా తలిపరంబ వద్ద గాంధీ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. విగ్రహాల కూల్చివేతపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర హెచ్చరికలు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరారు.

మరిన్ని వార్తలు