చేతులు కట్టుకొని కూర్చోం.. ఇంట్లోకి చొరబడి కొడతాం!

26 Feb, 2019 19:25 IST|Sakshi

‘హిందూస్తాన్‌ అబ్‌ చుప్‌ నహి బైఠేగా. యే నయా హిందూస్తాన్‌ హై. యె ఘర్‌ మే గుసెగా భీ, ఔర్‌ మారేగా భీ’ (భారతదేశం ఇప్పుడు చేతులు కట్టుకొని కూర్చోదు. ఇది ఒకప్పటి భారతదేశం కాదు. ఇప్పుడు ఇంట్లోకి చొరబడటమే కాదు దెబ్బతీసి చూపిస్తాం).. ‘ఉడీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ సినిమాలో అజిత్‌ ధోవల్‌ పాత్ర పోషించిన పరేశ్‌ రావల్‌  చెప్పిన డైలాగ్‌ ఇది.. 2016లో ఉడిలో భారత జవాన్లను టార్గెట్‌గా చేసుకొని ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్‌ సైన్యం తొలిసారి పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద తండాలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించింది. ఈ సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంతో తెరకెక్కిన ‘ఉడీ’ సినిమా సంచలన విజయం సాధించింది.  40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మరోసారి పాక్‌కు బుద్ధి చెప్తూ సర్జికల్‌ స్ట్రైక్స్‌-2 నిర్వహించినట్టు భారత సైన్యం ప్రకటించింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న భారతీయుల్లో ఆనందార్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పలు చోట్ల యువత, ప్రజలు రోడ్లమీదకు వచ్చి సంబరాలు జరుపుకుంటున్నారు.

ఇక, సోషల్‌ మీడియాలో, వాట్సాప్‌ లాంటి మెసేజింగ్‌ యాప్‌ల్లో సర్జికల్‌ స్ట్రైక్స్‌-2 గురించే చర్చ జరుగుతోంది. చాలామంది ‘ఉడీ’లో పరేశ్‌ రావల్‌ చెప్పిన డైలాగ్‌ను ఉటంకిస్తున్నారు. భారత్‌ ఒకప్పటిలా సైలెంట్‌గా ఉండదు.. మాతో పెట్టుకుంటే ఇంట్లోకి చొరబడి కొడతాం.. అంటూ ఈ సినిమా డైలాగులను చాలామంది వాట్సాప్‌ స్టేటస్‌లుగా, ఫేస్‌బుక్‌లో పోస్టులుగా పెట్టుకుంటున్నారు. భారత వైమానిక దళానికి, సైన్యానికి సెల్యూట్‌ చేస్తున్నారు. జవాన్లును ఆత్మాహుతి దాడిలో మట్టుబెట్టిన ఉగ్రవాదులకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలట్లు గట్టిగా బుద్ధి చెప్పారని ప్రశంసిస్తున్నారు. మరో విశేషమేమిటంటే.. సర్జికల్‌ స్ట్రైక్‌-2 గురించి కథనాలు వెలువడగానే.. టోరంటో వెబ్‌సైట్‌లో ‘ఉడీ’ సినిమా కోసం సెర్చ్‌ కోసం సెర్చ్‌ చేసిన వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. నెలన్నర కింద విడుదలై.. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన ఈ సినిమాను మళ్లీ చూసేందుకు నెటిజన్లు ఎగబడ్డారు.

మరిన్ని వార్తలు