ఆమె కారు కోసం.. రూ. 78 కోట్లతో రోడ్లు!

21 Oct, 2016 17:21 IST|Sakshi
ఆమె కారు కోసం.. రూ. 78 కోట్లతో రోడ్లు!
రియో ఒలింపిక్స్‌లో త్రుటిలో పతకం చేజార్చుకున్న భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కోసం.. ఆమె ఉండే ప్రాంతంలో ప్రత్యేకంగా రోడ్లు బాగు చేయిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం వాళ్లు తనకు ఇచ్చిన బీఎండబ్ల్యు కారును ఇక్కడ నడిపించడం సాధ్యం కాదని, అందువల్ల ఆ కారును తిరిగి ఇచ్చేస్తానని ఆమె చెప్పిన విషయం పెద్ద వివాదానికి దారితీసింది. సుదీర్ఘ కాలంగా కమ్యూనిస్టుల పాలనలోనే ఉన్న త్రిపురలో రోడ్ల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. దాంతో ఈ రోడ్ల మీద ఇంత ఖరీదైన కారు నడిపించడం సాధ్యం కాదని దీపా కర్మాకర్ చెప్పింది. 
 
ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా భావించిన అగర్తలా మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ప్రఫుల్‌జిత్ సిన్హా.. అభోయ్‌నగర్ లోని దీపా కర్మాకర్ ఇంటిప్రాంతంలో ఉన్న రోడ్లన్నింటినీ బాగు చేయిస్తున్నట్లు చెప్పారు. అక్కడి నుంచి అగర్తలా మెడికల్ కాలేజి వరకు ఉన్న రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ. 78 కోట్లు కేటాయించినట్లు పీడబ్ల్యుడి శాఖ అధికారి ఒకరు తెలిపారు. కాగా ప్రభుత్వ నిర్ణయం పట్ల దీపా కర్మాకర్ హర్షం వ్యక్తం చేసింది. బీఎండబ్ల్యు కారు తిరగడానికి రోడ్ల గురించి తాను ఫిర్యాదు చేయలేదని... రోడ్ల వెడల్పుతో పాటు నాణ్యత కూడా ముఖ్యమేనని, కారు నిర్వహణ, సర్వీసింగ్ లాంటివి కూడా ముఖ్యాంశాలని ఆమె చెప్పింది. అందువల్లే కారు వెనక్కి ఇవ్వాలనుకున్నట్లు తెలిపింది.
మరిన్ని వార్తలు