యువ న్యాయవాదులకు ఆదర్శం పరాశరన్‌ - ఉపరాష్ట్రపతి

20 Oct, 2019 21:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అపారమైన జ్ఞానం, క్రమశిక్షణ, కఠోర శ్రమ, నైతిక విలువలను కలిగిన వ్యక్తే మాజీ అటార్నీ జనరల్‌ కే.పరాశరన్‌ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఏజ్‌ కేర్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పరాశరన్‌ నేడు సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా గౌరవం అందుకుంటున్నారంటే కారణం ఆయనకున్న విలువలు, వృత్తిపట్ల నిబద్ధతే కారణమన్నారు.

ఏజ్‌ కేర్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో కే.పరాశరన్‌కు 'మోస్ట్‌ ఎమినెంట్‌ సీనియర్‌ సిటిజన్‌ అవార్డు'ను ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అందజేశారు. పరాశరన్‌ను భారత న్యాయవాదుల సంఘానికి పితామహుడిగా, సూపర్‌ అటార్నీ జనరల్‌గా పిలుచుకోవడం ఆయనకు భారత సమాజం ఇచ్చే గౌరవమన్నారు. ధర్మంతో పాటు న్యాయాన్ని పాటించడం వల్లే పరాశరన్‌ నేటికీ యువ న్యాయవాదులకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. 

మరిన్ని వార్తలు