అగ్ని5కి ఆఖరి టెస్ట్‌.. ఇక చైనాకు చెక్‌!

26 Dec, 2016 19:34 IST|Sakshi

భువనేశ్వర్:  స్వదేశీ పరిజ్ఞానంతో డిఫెన్స్ రిసెర్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) రూపొందించిన అగ్ని-5 ఖండాంతర క్షిపణిని మరోసారి విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్‌లో గల కలామ్‌ ఐల్యాండ్ నుంచి సోమవారం ఉదయం శాస్త్రవేత్తలు ఈ క్షిపణిని పరీక్షించారు. ఈ అగ్ని-5 క్షిపణి 5వేల నుంచి ఆరు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇంకా చెప్పాలంటే ఉత్తర చైనాలోని ఏప్రాంతాన్నైనా అగ్ని-5లక్ష్యంగా చేసుకోగలదు. ఉపరితలం నుంచి ఉపరితలానికి దాదాపు 1500 కిలోల అణ్వస్త్రాలను ఒకేసారి మోసుకెళ్లగలుగుతుంది.

ఈ క్షిపణికి పరీక్ష జరపడం ఇది నాలుగోసారి. గతంలో జరిపిన మూడు పరీక్షలు విజయవంతమయ్యాయి. తాజాగా జరిపిన పరీక్ష కూడా విజయవంతం కావడంతో ఇక సైన్యం చేతిలోకి క్షిపణి వెళ్లనుంది. మూడంచెల స్టేజ్‌ ఉండే అగ్ని-5.. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు కలిగి ఉంటుంది. 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను పక్కాగా ఛేదించగలదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్షిపణిని రూపొందించారు. అయితే దీని రేంజ్ 8వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందనేది అనధికారిక సమాచారం. ఇప్పటికే భారత అమ్ములపొదిలో అగ్ని-1(700 కిలోమీటర్లు), అగ్ని-2(2వేల కిలోమీటర్లు), అగ్ని-3(2500 కిలోమీటర్లు), అగ్ని-4(3500 కిలోమీటర్ల లక్ష్య ఛేదన) క్షిపణులు ఉన్నాయి. ఈ పరీక్ష విజయవంతమైనందున రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ డీఆర్డీవోకు అభినందనలు తెలిపారు.

అగ్ని-5 కొన్ని అంశాలు
1. 5,500 నుంచి 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుత్తునీయలు చేయగల ఖండాంతర క్షిపణి అగ్ని-5
2. దేశీయంగా సిద్ధం చేస్తున్న క్షిపణుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ క్షిపణిని డీఆర్‌డీవో రూపొందించి పర్యవేక్షిస్తోంది.
3.అగ్ని 5కు అణు సామర్థ్యం ఉంది. 1,500 కేజీల పేలుడు పదార్థాలను ఒకేసారి తీసుకెళ్లగలుగుతుంది
4. అగ్ని క్షిపణుల వరుసలో ఇది ఐదో తరంది. ఇప్పటికే భారత అమ్ములపొదిలో అగ్ని 1, 2, 3,4 ఉన్నాయి
5.అగ్ని 5 పూర్తి స్థాయి సామర్థ్యంతో విజయం సాధిస్తే సుదూరంలోని శత్రువులను ఈ క్షిపణిచే తుదముట్టించే అవకాశం ఉంటుంది.
6.అగ్ని 5  క్షిపణిని 2012, 2013, 2015లో పరీక్షించారు
7.నేడు ఒడిశాలోని వీలర్‌ ఐలాండ్‌లో జరిగిన పరీక్షే ఇక ఆఖరిది.
8.తాజా పరీక్ష విజయవంతం అయితే, దీనిని వ్యూహాత్మక బలగాలు తొలుత ఉపయోగించి అనంతరం మిలటరీకి అప్పగిస్తారు.

 

 

మరిన్ని వార్తలు