యూపీ బస్సు ప్రమాద బాధితురాలి ఆవేదన

9 Jul, 2019 16:37 IST|Sakshi

లక్నో : నాకు చికిత్స తర్వాత.. ముందు నా భర్త, కుమార్తె ఎక్కడ ఉన్నారో.. ఎలా ఉన్నారో చెప్పండి. వారిని చూస్తే.. నాకు వెంటనే నయమవుతుంది అంటూ విలపిస్తున్నారు రాయ్‌ బరేలీకి చెందిన సునీత(25). యూపీ బస్సు ప్రమాద సంఘటనలో ఆమె కూడా బాధితురాలే. యూపీలోని ఆగ్రా సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. యూపీ రోడ్‌వేస్‌కు చెందిన జన్‌రథ్‌ ఏసీ స్లీపర్‌ కోచ్‌ బస్సు (అవధ్‌ డిపో) లఖ్‌నవూ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆగ్రా శ్రీ కృష్ణ ఆస్పత్రిలో చేర్చారు. వారిలో సునీత కూడా ఉన్నారు.

సునీతకు వైద్యం చేయడానికి వచ్చిన సిబ్బందిని ఆమె తన భర్త, కుమార్తె ఆచూకీ చెప్పమని వేడుకుంటున్నారు. కానీ ఎవరూ ఆమెకు సరైన సమాధానం చెప్పడం లేదు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన వారికి తన భర్త ఫోన్‌ నంబర్‌ ఇచ్చి కాల్‌ చేయమని కోరుతుంది సునీత. అయితే ఎవరూ ఫోన్‌ ఎత్తడం లేదు. ఎందుకంటే ప్రమాదంలో ఆమె భర్త మరణించాడు. అయితే ఆ విషయాన్ని సునీతకు చెప్పడానికి ఎవరికి ధైర్యం సరిపోవడం లేదు. భర్తతో పాటు సునీత కుమార్తె కూడా మరణించింది.(చదవండి : విషాదం : శవాలను తొక్కుకుంటూ)

ప్రమాదం గురించి సునీత మాట్లాడుతూ.. ‘నేను, నా భర్త, కుమారుడు, ఏడాదిన్నర వయసున్న కుమార్తెతో కలిసి ఢిల్లీ వెళ్తున్నాం. తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో మా బస్సు మురికి కాల్వలో పడింది. ఆ తర్వాత ఏం జరిగింది నాకు గుర్తు లేదు. నా భర్త, కుమార్తె గురించి అడుగుతుంటే ఎవరూ సరిగా స్పందించడం లేదు’ అంటూ సునీత కన్నీరుమున్నీరు అవుతుంది. అయితే ఆమె దగ్గరకు వెళ్లి ఓదార్చి నిజం చెప్పే సాహసం మాత్రం ఎవరూ చేయడం లేదు. ప్రస్తుతానికైతే ఆమె భర్తకు, కుమార్తెకు వేరే చోట చికిత్స జరుగుతుందని చెప్పి ఆమెను మభ్యపెడున్నారు.

మరిన్ని వార్తలు