ఘోర తప్పిదం : విద్యార్థి మార్క్‌షీటుపై సల్మాన్‌ ఫోటో

21 Nov, 2017 20:34 IST|Sakshi

ఆగ్రా : ఉత్తరప్రదేశ్‌లో విద్యావ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉందో రుజువైంది. ఆగ్రా యూనివర్సిటీకి చెందిన ఫస్ట్‌ ఇయర్‌ బీఏ విద్యార్థి మార్క్‌షీటుపై నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఫోటో ప్రింట్‌ అయి వచ్చింది. విద్యార్థులకు మెడల్స్‌, సర్టిఫికేట్లు జారీచేయడానికి అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్‌ డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ ఆగ్రా యూనివర్సిటీకి రాబోతున్న ఒక్క రోజు ముందు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రోల్‌ నెంబర్‌ 17028700***** తో ఉన్న మార్క్‌షీటుపై సల్మాన్‌ ఖాన్‌ పాస్‌పోర్టు సైజ్‌ ఫోటో పేస్టు చేసి ఉంది. అంతేకాక అలీగఢ్‌లోని తేజ్‌పూర్‌ జావాలో ఉన్న ఆగ్రా యూనివర్సిటీ అనుబంధ కాలేజీ అమ్రత సింగ్‌ మెమోరియల్‌ డిగ్రీ కాలేజీ నుంచి 35 శాతం మార్కులతో ఆ విద్యార్థి తొలి ఏడాది పూర్తి చేసినట్టు ఉంది. 

మార్కు షీటులను విద్యార్థులకు జారీచేసేటప్పుడు క్రాస్‌ చెకింగ్‌లో ఈ ఘోర తప్పిదాన్ని యూనివర్సిటీ అధికారులు గుర్తించారు. మరో మార్కు షీటుపై రాహుల్‌ గాంధీ ఫోటో ఉన్నట్టు కూడా బయట పడింది. అంతేకాక విద్యార్థుల పేర్లు కూడా అసలవి కాకుండా తప్పుడుగా భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ అని ముద్రణ జరిగినట్టు గుర్తించారు. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన యూనివర్సిటీ అధికారులు జారీచేసిన మార్కుషీటులను రీకాల్‌ చేశారు. మార్కు షీటును ప్రింట్‌ చేసిన ప్రైవేట్‌ ఏజెన్సీ వల్ల ఈ తప్పిదం జరిగి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆగ్రా యూనివర్సిటీకి అనుబంధంగా 1000కి పైగా కాలేజీలున్నాయి. వీటిలో 7.2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 

మరిన్ని వార్తలు