వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధే ధ్యేయం

22 Jun, 2018 14:13 IST|Sakshi
ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి   

ముఖ్యమంత్రి నవీన్‌  పట్నాయక్‌

ఓయూఏటీలో రైతులతో చైతన్య కార్యక్రమం

భువనేశ్వర్‌: రాష్ట్ర వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక ఒడిశా యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ  (ఓయూఏటీ) సముదాయంలో రైతు చైతన్య కార్యక్రమాన్ని ఆయన గురువారం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రదీప్త మహారథి, విభాగం కార్యదర్శి సౌరవ్‌ గర్గ్, సహకార శాఖ కార్యదర్శి రంజనా చోప్రా, కమిషనర్‌ గగన్‌ ధొలొ, ఒడిశా యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ వైస్‌ చాన్స్‌లర్‌ ఎస్‌.ఎన్‌.పశుపాలక్‌ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

సమావేశంలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి వ్యవసాయ రంగాన్ని బహుముఖంగా అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో తమ ప్రభుత్వం నిరవధికంగా కృషి చేస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టామని తెలిపారు.

ఈ బడ్జెట్‌ పరిమాణం రూ.14 వేల కోట్లకు తాకిందని చెప్పారు. రాష్ట్ర రైతాంగం ఆదాయం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరచూ పలు పథకాల్ని ప్రవేశ పెడుతోంది. వ్యవసాయం అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశ పెట్టడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా కృషి చేసి వ్యవసాయ క్యాబినెట్‌ను ప్రవేశ పెట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

రైతులు, వ్యవసాయ సంబంధిత అంశాల్ని ఈ క్యాబినెట్‌ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. వ్యవసాయ రంగంలో పలు సంస్కరణలు, నూతన ఆవిష్కరణలు, అనుబంధ సాగు కార్యకలాపాలపట్ల రైతాంగాన్ని చైతన్య పరిచేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ రాష్ట్ర రైతాంగానికి బలోపేతం చేస్తుంది. ఏడాదిపాటు నిరవధికంగా రాష్ట్రవ్యాప్తంగా రైతాంగానికి ఈ శిక్షణ కల్పిస్తారని ప్రకటించారు. 

314 సమితుల రైతులకు శిక్షణ

ముఖ్యమంత్రి ప్రారంభించిన రైతు చైతన్య శిక్షణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 314 సమితుల్లో రైతులకు శిక్షణ కల్పిస్తారు. ప్రతి పంచాయతీ నుంచి నిత్యం ఇద్దరు చొప్పున రైతులు శిక్షణలో  పాల్గొంటారు. ఈ లెక్కన 6,798 పంచాయతీల నుంచి 13,596 మంది రైతులకు శిక్షణ కల్పిస్తారు.

ఒక్కో సమితి నుంచి రోజుకు సుమారు 40 నుంచి 50 మంది వరకు రైతులకు శిక్షణ కల్పిస్తారు. వ్యవసాయం, సాగు పనుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతాంగానికి కల్పిస్తారు. ఈ శిబిరంలో శిక్షణ పొందిన రైతులు గ్రామాల్లో మిగిలిన రైతులకు శిక్షణ అందజేస్తారు. బొలంగీరు జిల్లాలోని పలు సమితుల నుంచి తొలి రోజున 56 మంది రైతులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ నేపథ్యంలో రైతులు తమ సమస్యల్ని వివరించారు. వ్యవసాయ ఉత్పాదనలకు గిట్టుబాటు ధరలు, ఉత్పాదనల దీర్ఘ కాల నిల్వ కోసం శీతల గిడ్డంగుల కొరత ప్రధాన సమస్యలుగా పేర్కొన్నారు. త్వరలో ఈ సమస్యల్ని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ రైతులకు హామీ ఇచ్చారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా