మధ్యవర్తి 180 సార్లు ఇండియాకు వచ్చాడు!

11 May, 2016 10:45 IST|Sakshi
మధ్యవర్తి 180 సార్లు ఇండియాకు వచ్చాడు!

న్యూఢిల్లీః  అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆసక్తికర సమాచారాన్ని సాధించింది. ఎనిమిదేళ్ళలో ఓ మధ్యవర్తి ఇటలీనుంచి భారత్ కు తరచుగా 180 సార్లు  ప్రయాణించిన విషయం ఇప్పుడు పరిశోధక బృందాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఫారెన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) రికార్డులు పరిశీలించిన అధికారులకు వీవీఐపీ కుంభకోణంలో సదరు వ్యక్తి కీలక మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

అగస్టా కుంభకోణంలో ఓ మధ్యవర్తి కీలకంగా వ్యవహరించినట్లు తాజాగా సేకరించిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. బ్రిటన్ జాతీయుడు క్రిస్టియన్ మిచెల్ కుంభకోణంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నసంగతి తెలిసిందే. ప్రస్తుతం మిచెల్  2005 నుంచి 2013 సంవత్సరాలమధ్య దాదాపు 180 సార్లు ఇండియాను సందర్శించడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఛాపెర్ కుంభకోణంలో అతడు మధ్యవర్తిత్వాన్ని జరిపి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మిచెల్ భారత్ సందర్శనల్లో ఎక్కువ శాతం ఢిల్లీలోనే  ఉండటమే కాక మధ్యవర్తిగా అభినవ్ త్యాగి, అతడి సహచరుడు, షెల్ సంస్థ డైరెక్టర్ జెబి. సుబ్రమణ్యం కూడ  ఉన్నట్లు ఎఫ్ఆర్ఆర్ఓ కార్యాలయంలో మిచెల్ ఇచ్చిన  సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే ఈ అభినవ్ త్యాగికి,  ముడుపులు అందుకున్న త్యాగి కుటుంబానికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సీబీఐ, ఈడీ అధికారులు 2012  నుంచి 2013 మధ్య  ఢిల్లీకి జరిగిన సందర్శనలపై అన్వేషణ ప్రారంభించారు.

అయితే కుంభకోణంపై భారత్ లో దర్యాప్తు ప్రారంభమైన తర్వాత మిచెల్ ఇండియాలో ఒక్కసారి కూడ పర్యటించకపోవడమే కాక, అరబ్బు దేశాలకు పారిపోయి, అక్కడే నివసిస్తున్నట్లు తెలియడంతో ఈడీ ఇప్పటికే అతడి అరెస్టుకోసం అభ్యర్తన పంపింది. ఎనిమిది, తొమ్మిదేళ్ళలో 180 సార్లు దేశానికి పర్యటించడం అంటే ఆశ్చర్యకరమైన, అనుమానించదగ్గ విషయమేనని, అతడు ఇండియాలో సంజీవ్ త్యాగి సహా ఇతరులను కలసిన సమాచారాన్ని కూడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. భారత్ సందర్శించిన సమయంలో మిచెల్ ఎక్కువగా ఫైవ్ స్టార్ హోటళ్ళతోపాటు, అతడి 1.2 కోట్ల విలువైన, ఇప్పటికే అటాచ్ చేసిన, సఫ్దర్ జంగ్ ఎన్ క్లేవ్ లోని ఆయన నివాసంలో ఉండేవాడని ఓ సీనియర్ అధికారి చెప్తున్నారు.

మరిన్ని వార్తలు