‘అగస్టా’ మైకేల్‌ను విచారించనున్న సీబీఐ

21 Sep, 2019 09:48 IST|Sakshi

న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్‌ కుంభకోణంలో మధ్యవర్తిగా భావిస్తున్న క్రిస్టియన్‌ మైకేల్‌(58)ను విచారించేందుకు సీబీఐకి ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 24 నుంచి 26 వరకు విచారించవచ్చని పేర్కొంది. ప్రస్తుతం మైకేల్‌ ఉంటున్న తీహార్‌ సెంట్రల్‌ జైల్లోనే ఈ విచారణ జరగనుంది. జైల్‌ సూపరింటెండెంట్‌ పర్యవేక్షణలోగానీ, లేదా ఆయన అనుమతించిన వారి పర్యవేక్షణలోగానీ ఈ విచారణ జరగనుంది. గతేడాది డిసెంబర్‌లో దుబాయ్‌ ప్రభుత్వం ఆయనను భారత్‌కు అప్పగించింది. బ్రిటన్‌ జాతీయుడైన మైకేల్‌ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు పుచ్చుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) 2016లో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో మైకేల్‌తో పాటు గైడో హాష్కే, కార్లో గెరోసా అనే మధ్యర్తులపైనా ఈడీ, సీబీఐలు దర్యాప్తు జరుపుతున్నాయి.

ఏమిటీ కుంభకోణం?
రూ.3600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్లు కొనేందుకు 2010, ఫిబ్రవరిలో నాటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘనకు గురవడంతో పాటు రూ.423 కోట్ల ముడుపులు చేతులు మారాయని, కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో 2014 జనవరి 1న ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హెలి కాప్టర్లు ఎగిరే ఎత్తు పరిమితిని 6 వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించి కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఎత్తు తగ్గించడం ద్వారానే అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ ఒప్పందం చేసుకోవడానికి అర్హత సాధించిందని తెలిపింది.

మరిన్ని వార్తలు