-

అగస్టా కేసు : సీబీఐ కస్టడీకి మైకేల్‌

5 Dec, 2018 18:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసులో మధ్యవర్తిగా భావిస్తున్న క్రిస్టియన్‌ మైకేల్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం బుధవారం ఐదు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతించింది. అగస్టా కేసులో విచారణ కొనసాగుతోందని, ఈ డీల్‌లో రెండు దుబాయ్‌ ఖాతాలకు సొమ్మును చేరవేసినందున మైకేల్‌ కస్టడీ తమకు అవసరమని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. మరోవైపు ప్రత్యేక న్యాయస్ధానంలో బెయిల్‌ కోరుతూ మైకేల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోగా ఆయనను ఐదు రోజులు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ తదుపరి చేపడతామని న్యాయస్ధానం పేర్కొంది.

మైకేల్‌ను ఉదయం, సాయంత్రం గంట పాటు కలుసుకునేందుకు ఆయన న్యాయమూర్తికి కోర్టు అనుమతించింది. అగస్టా ఒప్పందంలో అభియోగాలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌ పౌరుడు మైకేల్‌ను మంగళవారం రాత్రి దుబాయ్‌ ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. అగస్టా కేసులో విచారణ జరుపుతున్న ముగ్గురు దళారీల్లో ఆయన ఒకరు. మరో ఇద్దరు మధ్యవర్తులు గైడో హస్కే, కార్లో గెరోసాలను ఈడీ, సీబీఐ విచారిస్తున్నాయి. మైకేల్‌కు కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన తర్వాత ఆయనపై సీబీఐ, ఈడీ రెడ్‌కార్నర్‌ నోటీసు జారీచేయాలని కోరుతూ ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి.

కాగా, బ్రిటన్‌ జాతీయుడైన మైకేల్‌ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కంపెనీ నుంచి రూ.225 కోట్ల ముడుపులు స్వీకరించినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) 2016లో చార్జిషీటు దాఖలు చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పర్యవేక్షణలో చేపట్టిన ఆపరేషన్‌ మూలంగానే మైఖేల్‌ను భారత్‌కు అప్పగించేందుకు యూఏఈ అంగీకరించిందని సీబీఐ తెలిపింది

మరిన్ని వార్తలు