అతివేగానికి కళ్లెం..

2 Aug, 2014 23:32 IST|Sakshi
అతివేగానికి కళ్లెం..

- ముఖ్య కూడళ్లలో హైటెక్ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
- వాహన నంబర్ సహా గుర్తించగలిగే ఏఎన్‌పీఆర్ టెక్నాలజీ వినియోగం
- ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ విభాగం చర్యలు

సాక్షి, ముంబై: నగరంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించే దిశగా ట్రాఫిక్ విభాగం చర్యలు తీసుకుంటోంది. మితిమీరిన వేగంతో వెళుతున్న వాహనాలకు కళ్లెం వేయడానికి అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు గాను వాహన వేగాన్ని నియంత్రించేందుకు నగరంలోని ఐదు ముఖ్య కూడళ్లలో నంబర్ ప్లేట్లను కూడా రికార్డు చేసే కొత్త హైటెక్ సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

కెమెరాల్లో వాహన నంబర్లను స్పష్టంగా చదివే విధంగా పరికరాలను అమర్చనున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ఏ ప్రాంతాల్లో వాహనాలు ఎక్కువ వేగంతో వెళుతున్నాయో ఆ ప్రదేశాల్లో ఈ కెమెరాలను అమర్చనున్నారు. అంతేకాకుండా ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్‌పీఆర్) టెక్నాలజీతో కూడుకున్న సీసీటీవీ కెమెరాలను అమర్చాల్సిందిగా ఏజెన్సీలను ట్రాఫిక్ విభాగం కోరింది. బాంద్రా-వర్లీ సీలింక్ (బీడబ్ల్యూఎస్‌ఎల్)పై కూడా ఈ కెమెరాలను ఈ ఏడాది చివరికల్లా అమర్చనున్నారు.

అదేవిధంగా బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), విక్రోలిలోని గోద్రేజ్ జంక్షన్, మెరిన్ డ్రైవ్, సౌత్ ముంబైలోని జేజే ఫ్లై ఓవర్‌లలో కూడా ఈ సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన వారిని పట్టుకోవడం కోసం ఏఎన్‌పీఆర్ కెమెరాలనే ఉపయోగిస్తూ ఉంటారు. ఇదిలా వుండగా నగరవ్యాప్తంగా ఈ కెమరాలను ఏఏ ప్రదేశాల్లో అమర్చాలో ఇప్పటికే అధ్యయనం నిర్వహించామని అడిషినల్ కమిషనర్ (ట్రాఫిక్) క్వైజర్ ఖలీద్ తెలిపారు.

విక్రోలిలోని గోద్రేజ్ జంక్షన్‌లో ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైందని ఆయన చెప్పారు. బాంద్రా-వర్లీ సీలింక్ కూడా ప్రమాదాలకు నిలయంగా మారుతోందని, ఇక్కడ కూడా వాహన దారులు అతి వేగంగా వాహనాలు నడుపుతున్నారని ఆయన తెలిపారు. కాగా బాంద్రా-వర్లీ సీలింక్‌పై రెండు వైపులా ఈ కెమరాలను అమర్చనున్నారు.
 
కాగా, ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ మార్గంపై కూడా ఈ కెమెరాలను అమర్చే అవసరముందా అనే అంశంపై అధ్యయనం నిర్వహించనున్నారని ఎంఎస్‌ఆర్డీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే బీడబ్ల్యూఎస్‌ఎల్, జేజే ఫ్లై ఓవర్‌పై ద్విచక్రవాహనాలను నిషేధించారు. 2002-10 మధ్య కాలంలో జేజే ఫ్లై ఓవర్‌పై 254 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

ఇందులో 183 ద్విచక్రవాహనాల వల్లనే జరిగినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదాలలో 33 మంది మరణించగా, అందులో 31 మంది ద్విచక్రవాహన దారులే. వ్యాపార కేంద్రంగా పేరుగాంచిన బీకేసీ వద్ద కార్యాలయ పని గంటలు ముగిసిన వెంటనే మితిమీరిన వేగంతో వాహనాలు వెళుతుండాన్ని గమనించామని ఆయన తెలిపారు. దీంతో ఆయా మార్గాలన్నింటిలోనూ సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు