శబరిమల చరిత్రలోనే తొలిసారి..!

5 Nov, 2018 16:35 IST|Sakshi

శబరిమల : మకరవిలక్కు పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు నేడు తెరుచుకోనున్నాయి. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సన్నిధానం తెరుచుకోవడం ఇది రెండోసారి. గతనెల మాసపూజల సందర్భంగా గుడిలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించడంతో... శబరిమల పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఆలయ చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వం 15 మంది మహిళా పోలీస్‌ ఉద్యోగులను ఆలయం వద్ద భద్రతా విధుల నిర్వహణ కోసం నియమించింది. అయితే వీరంతా 50 ఏళ్ల పైబడిన వారు కావడం గమనార్హం. ఆలయ సాంప్రదాయం ప్రకారం 10 సంవత్సరాల లోపు బాలికలు.. 50 ఏళ్ల పైబడిన మహిళలను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా 50 ఏళ్ల పైబడిన మహిళా పోలీసు అధికారులను నియమించింది. వీరిలో చాలా మంది ఇప్పటి వరకు ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకోలేదని తెలిపారు. మరోక ఉద్యోగిని ఆమె చిన్నతనంలో అయ్యప్ప దర్శనం చేసుకున్నానని చెప్పారు.

ఈ విషయం సదరు ఉద్యోగినులు మాట్లాడుతూ ‘మేము ఇక్కడ మాకు కేటాయించిన విధులు నిర్వహించడానికి వచ్చాము. ఆలయ నిబంధనలు ఉల్లంఘించి దర్శనం కోసం ప్రయత్నించే మహిళలను అడ్డుకోవడమే మా ప్రధాన బాధ్యత’ అని తెలిపారు. అయితే ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి ప్రస్తావించగా ‘నో కామెంట్స్‌’ అంటూ సమాధానమిచ్చారు. మకరవిలక్కు పూజల కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. రేపు సాయంత్రం 10 గంటలకు వరకూ తెరుచుకుని ఉంటుంది.

మరిన్ని వార్తలు