కదిలే రైలు ఎక్కాలని ప్రయత్నిస్తూ..

25 Sep, 2019 13:11 IST|Sakshi

గాంధీనగర్‌: రైలు, బస్సు అనే కాదు ఏ వాహనం అయినా కదులుతుండగా ఎక్కడం ప్రమాదం. దీని గురించి ఎంత చెప్పినా.. జనాలు మాత్రం చెవికెక్కించుకోరు. సర్కస్‌ ఫీట్లు చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి గుజరాత్‌ అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే శాఖ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. వివరాలు.. పేరు తెలియని ఓ ప్రయాణికుడు ఆశ్రం ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కడం కోసం ప్లాట్‌ఫాం మీదకు వస్తున్నాడు. ఇంతలో రైలు కదలడం ప్రారంభించింది. దాంతో సదరు వ్యక్తి గబగబా పరిగెత్తుకు వెళ్లి మూవింగ్‌ ట్రైన్‌ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి బోగిలోకి కాలు పెట్టాడో లేదో వెంటనే తలుపులు మూసుకుపోయాయి. దాంతో పట్టు కోల్పోయి పట్టాల మీద పడబోతుండగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది అతడిని పైకి లేపి.. బోగిలోకి నెట్టి ప్రమాదం నుంచి కాపాడారు. సెకన్ల వ్యవధిలో ఆ వ్యక్తి మరణం అంచుల దాకా వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది.
 

ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ఈ సంఘటనతో అతనికి బుద్ధి వచ్చి ఉంటుంది. మళ్లీ జన్మలో ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని నిర్ణయించుకుని ఉంటాడు’.. ‘ఇది కాకపోతే మరో రైలు.. కానీ ఈ జీవితం ముగిస్తే.. మరోటి లేదు. అలాంటిది ప్రాణాలను పణంగా పెట్టి మరి ఇంత రిస్క్‌ చేయడం అవసరమా’ అంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని వార్తలు