20 ఏళ్ల తర్వాత కేబినెట్‌లోకి..

31 May, 2019 07:37 IST|Sakshi

న్యూఢిల్లీ : దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఏఐఏడీఎంకే కేంద్ర కేబినెట్‌లో స్థానం సంపాదించుకుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో ఏఐఏడీఎంకే ఒకే ఒక్క స్థానం దక్కింది. తేని నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం కుమారుడు రవీంద్రనాథ్‌ కుమార్‌ 53 వేల మెజారిటీతో విజయం సాధించారు. కేంద్ర కేబినెట్‌లో బెర్త్‌ కోసం ఓపీ రవీంద్ర నాథ్, ఏఐఏడీఎంకే రాజ్యసభ ఎంపీ ఆర్‌.వైద్యలింగం మధ్య పోటీ నెలకొంది. చివరికి పన్నీరు వర్గమే పైచేయి సాధించింది. కేబినెట్‌లో స్థానం ఖరారైనట్లు గురువారం ఉదయం సమాచారం అందడంతో రవీంద్రనాథ్‌ ఢిల్లీకి చేరుకున్నారు. పదవీ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ..‘అమ్మ ఆశీర్వాదం వల్లే ఈ పదవి నాకు దక్కింది’ అని అన్నారు. రవీంద్రనాథ్‌ రాజకీయ జీవితం 1999లో ఏఐఏడీఎంకే కార్యకర్తగా మొదలయింది.

ఆ సమయంలో ఆయన ఏఐఏడీఎంకే తిరుగుబాటు నేత టీటీవీ దినకరన్‌ సహా పలువురు నేతలకు సహాయకుడిగా పనిచేశారు. భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు పన్నీరుసెల్వంపై ఆరోపణలు రావడంతో జయలలిత 2016 ఎన్నికల సమయంలో ఆయన్ను పక్కనబెట్టారు. తిరిగి 2018లో పురచ్చి తలైవి అమ్మ పెరవాయ్‌ పార్టీ తేని జిల్లా కార్యదర్శిగా రవీంద్రనాథ్‌ నియమితులయ్యారు. 1998లో ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఏఐఏడీఎంకే కూడా ఉంది. ఆ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో కొద్దిరోజులకే వాజపేయి ప్రభుత్వం పతనమయింది.  

చోటుదక్కని ప్రముఖులు 
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించినా కేబినెట్‌లో చోటుదక్కని ప్రముఖులు.. మనేకాగాంధీ, రాధామోహన్‌సింగ్, జయంత్‌ సిన్హా, అనుప్రియా పటేల్, రామ్‌ కృపాల్‌ యాదవ్, రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్, అనంత్‌కుమార్‌ హెగ్డే 
ఓటమి పాలైన గత కేబినెట్‌ మంత్రులు : మనోజ్‌ సిన్హా, అల్ఫోన్స్‌ కన్నంతనమ్, హన్స్‌రాజ్‌ ఆహిర్‌ 
ఎన్నికల్లో పోటీ చేయని వారు : సురేష్‌ ప్రభు, సుష్మాస్వరాజ్, ఉమా భారతి, బీరేంద్ర సింగ్, అరుణ్‌ జైట్లీ 
ఓటమిపాలైనా పదవి దక్కించుకున్న మంత్రి : హర్దీప్‌ సింగ్‌ పురి 
ఎన్నికల్లో పోటీకి టికెట్‌ నిరాకరణకు గురైన మంత్రి : విజయ్‌ సంప్లా 

మరిన్ని వార్తలు