దుర్భాష‌లాడి, భౌతిక దాడికి పాల్ప‌డ్డ అన్నాడీఎంకే నేత‌

29 Jun, 2020 16:11 IST|Sakshi

చెన్నై : టోల్‌ప్లాజా వ‌ద్ద ఈ-పాస్ అడిగిన కార‌ణంగా విదుల్లో ఉన్న పోలీసుపై  డీఎంకే నేత‌, మాజీ ఎంపీ కే. అర్జున‌న్ భౌతిక‌దాడికి పాల్ప‌డ్డారు. వివరాల ప్ర‌కారం.. సేలం- బెంగుళూరు హైవేలోని టోల్ ప్లాజా ద‌గ్గ‌ర మాజీ ఎంపీ కారును ఆపి పాస్ చూపించాల‌ని కోర‌గా అర్జున‌న్ పోలీసుల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. నా స్థాయి ఏంటో తెలుసా..న‌న్నే ప‌ర్మిష‌న్ లెట‌ర్ అడగ‌టానికి ఎంత ధైర్యం అంటూ ఓవ‌రాక్ష‌న్ చేశారు. అయిన‌ప్ప‌టికీ ఈ- పాస్ ఉంటేనే ప్ర‌యాణానికి అనుమ‌తిస్తామంటూ చెప్ప‌గా..అర్జున‌న్ కోపంతో ఊగిపోయారు. కారు దిగి వ‌చ్చి స‌ద‌రు పోలీసుపై చేయి చేసుకోవడ‌మే కాకుండా కాలితో త‌న్నారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలు టోల్ ప్లాజా ద‌గ్గ‌రున్న సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యింది. (ఇప్పట్లో వాటికి దూరం.. )

అయితే ఇప్ప‌టివ‌ర‌కు అర్జున‌న్‌పై అధికారులు కేసు న‌మోదు చేయ‌లేదు. 1980 ప్రారంభంలో డీఎంకే ఎంపీగా విజ‌యం సాధించిన అనంత‌రం అర్జున‌న్  అన్నాడీఎంకేలో చేరారు. ఒక జిల్లా నుంచి మ‌రో జిల్లాకు ప్ర‌యాణించాలంటే ఈ-పాస్‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఇటీవ‌లె ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే టోల్‌ప్లాజా వ‌ద్ద  ఈ-పాస్ కోసం అడ‌గ్గా అధికారుల‌ను దుర్భాష‌లాడుతూ భౌతిక‌దాడికి  పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఫుటేజీలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌టంతో  అర్జున‌న్‌పై కేసు న‌మోదు చేయాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు. (రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే స్వీట్ వ‌చ్చేసింది.. )

మరిన్ని వార్తలు