విలీన చర్చలు విఫలం

19 Aug, 2017 07:30 IST|Sakshi
విలీన చర్చలు విఫలం

కీలక అంశాలపై పళని, పన్నీర్‌ వర్గాల మధ్య విభేదాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై:
అన్నాడీఎంకేలో పళని, పన్నీర్‌ వర్గాల విలీనం మరోసారి వాయిదాపడింది. ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు ఇరు వర్గాలు శుక్రవారం వేర్వేరుగా జరిపిన సుదీర్ఘ చర్చలు విఫలమయ్యాయి. కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరు వర్గాల నేతలు మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. అంతకముందు అమ్మ సమాధి సాక్షిగా విలీనమంటూ ఉదయం నుంచి ప్రచారం సాగింది. రెండు వర్గాల విలీనానికి మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద ఏర్పాట్లు చేయడంతో ఏ క్షణం ఎలాంటి ప్రకటన వెలువడుతుందోనని ఉత్కంఠ కొనసాగింది. 

ఉదయం నుంచి చెన్నైలో వాతావరణం వేడెక్కింది. ఉదయం సీనియర్‌ నేతలు, మంత్రులు, తమ వర్గం నేతలు, ఎమ్మెల్యేలతో సీఎం పళని స్వామి భేటీ అయ్యారు. జయలలిత మరణంపై విచారణకు ఆదేశించడం, వేద నిలయాన్ని స్మారక మందిరంగా మార్చడం వంటి పన్నీర్‌ వర్గ డిమాండ్లను నేరవేర్చిన నేపథ్యంలో విలీనంపై ఈ భేటీలో చర్చించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్‌పై కూడా సానుకూలంగానే ఉన్నట్లు పళని వర్గం సంకేతాలిచ్చింది. కాగా శుక్రవారం సాయంత్రం పన్నీర్‌ సెల్వం కూడా తన వర్గ నేతలతో సమావేశమయ్యారు.

ప్రభుత్వ తాజా నిర్ణయాలపై వారు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. పన్నీర్‌సెల్వం ఎలాంటి ప్రకటన చేసినా వెంటనే స్పందించేందుకు వీలుగా పళని స్వామి సైతం పార్టీ ప్రధాన కార్యాలయంలో మంత్రివర్గం, సీనియర్‌ నేతలతో భేటీ అయ్యారు. మెరీనాబీచ్‌లోని అమ్మ సమాధి సాక్షిగా విలీనంపై ప్రకటన చేస్తారని ప్రచారం జరిగింది. దీంతో రాత్రి 7 గంటల సమయంలో జయ సమాధిని హడావుడిగా అలంకరించారు. పళని, పన్నీర్‌ కోసం రెండు పుష్పగుచ్ఛాల్ని సిద్ధం చేశారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేతలు, కార్యకర్తలు సమాధివద్దకు చేరుకున్నారు.

ఇరు వర్గాల నేతలు సాయంత్రం 5 గంటలకు ప్రారంభించిన చర్చలు రాత్రి 10 గంటలు దాటినా కొలిక్కిరాకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగింది. మా నాయకుడు అన్ని వివరాలు చెబుతారంటూ పన్నీర్‌ సెల్వం వర్గం నేతలు మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.   ప్రభుత్వం, పార్టీలో పరిణామాల్ని శశికళకు వివరించేందుకు దినకరన్‌ శుక్రవారం బెంగళూరు బయల్దేరి వెళ్లారు.  వేదనిలయంపై తమకే హక్కు ఉందని, ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని జయలలిత మేనకోడలు దీప ప్రకటించారు. వేద నిలయం తనకు, దీపకు చెందుతుందని, కావాలంటే చట్టపరంగా స్వాధీనం చేసుకోవాలని సీఎంకి దీపక్‌ లేఖ రాశారు. జయ తల్లి సంధ్య రాసిన వీలునామా దీపక్‌ వద్ద ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు