శశికళ పుష్ప భర్తపై దాడి

29 Dec, 2016 03:02 IST|Sakshi
శశికళ పుష్ప భర్తపై దాడి

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఘటన

టీ నగర్‌ (చెన్నై): అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప భర్తపై ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్దకు బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్టీ కార్యాలయం వద్దకు బుధవారం మధ్యాహ్నం తన లాయర్‌తో కలసి శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిలకన్‌ వచ్చారు. అదే సమయంలో అక్కడున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఇన్బదురై ఇక్కడేం పనంటూ లింగేశ్వరను ప్రశ్నించారు. దీంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి తన భార్య శశికళ పుష్ప పోటీ చేయనున్నారని, దరఖాస్తును ఇక్కడే తీసుకోవాలని తిలకన్‌ కోరారు. అనంతరం శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ నేపథ్యంలో అక్కడున్న పార్టీ కార్యకర్తలు ఆగ్రహావేశాలకు గురై ఒక్కసారిగా తిలకన్‌పై దాడికి దిగారు. తిలకన్‌ ముక్కు నుంచి తీవ్రంగా రక్త స్రావమైంది. పోలీసులు ఆయన్ను రక్షించి రాయపేట పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు భద్రత కల్పించారు. ఈ ఘటనపై అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్‌ సరస్వతి స్పందిస్తూ.. గురువారం పార్టీ సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు పుష్ప ప్రయత్నించారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు