ఉపసభాపతి తంబిదురై

14 Aug, 2014 02:56 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటులో అన్నాడీఎంకే నేత ఎం.తంబిదురై లోక్‌సభ ఉప సభాపతిగా బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి తంబిదురై ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. తద్వారా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవికి రెండవసారి ఎన్నికైన తొలి నేతగా రికార్డులకెక్కారు. ఈ పదవికి 67 ఏళ్ల తంబిదురై అభ్యర్థిత్వాన్ని బీజేపీ, కాంగ్రెస్‌సహా అన్ని ప్రధాన పార్టీలూ బలపరిచాయి. తొలుత లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు.

తంబిదురై పేరును రాజ్‌నాథ్ ప్రతిపాదించగా, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ మద్దతు తెలిపారు. తంబిదురై అభ్యర్థిత్వానికి  ఎన్డీయే కూటమి పక్షాలు, ఇతర పార్టీలు మద్దతు పలికాయి. దీంతో తంబిదురై డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్‌పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, ఇతర పార్టీల ఫ్లోర్‌లీడర్లు తంబిదురైకు అభినందనలు తెలుపుతూ ఆయన్ను కుర్చీ వరకు తోడ్కోని వెళ్లారు.
 

మరిన్ని వార్తలు