ఏఐబీపీ సాయం 60 శాతానికి పెంచాలి

6 Mar, 2016 03:56 IST|Sakshi

కేంద్రానికి మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి
*  తెలంగాణ నుంచి మరో నాలుగు ప్రాజెక్టులను ఏఐబీపీలో చేర్చాలి
*  జల వనరుల సమన్వయ కమిటీ భేటీకి మంత్రి హాజరు

 సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోని సత్వర సాగునీటి ప్రాయోజిత (ఏఐబీపీ) పథకం కింద రాష్ట్రాల నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రస్తుతం ఇస్తున్న నిధుల వాటాను 25% నుంచి 60 శాతానికి పెంచాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణలోని మరో నాలుగు ప్రాజెక్టులను ఈ పథకం కింద చేర్చాలని కోరారు. శనివారం కేంద్ర జలవ నరుల శాఖ కార్యాలయంలో తొలిసారిగా జల వనరుల సమన్వయ కమిటీ భేటీ అయింది. దేశవ్యాప్తంగా పీఎంకేఎస్‌వై పథకం అమలు తీరుతెన్నుల పరిశీలన, మెరుగైన విధానాలు తెచ్చేందుకు వీలుగా ఇటీవలే కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఛత్తీస్‌గఢ్ నీటి పారుదల మంత్రి బ్రిజ్‌మోహన్ చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో మహారాష్ట్ర నీటి పారుదల మంత్రి గిరీష్ మహాజన్, మంత్రి హరీశ్‌రావు సభ్యులుగా ఉన్నారు.

ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేయడం, కేంద్రం నుంచి అందాల్సిన సాయం వంటి అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి కూడా ఇందులో పాల్గొన్నారు. కాగా ఈనెల  21వ తేదీన మరోసారి భేటీ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో 2016-17, 2017-18లో పూర్తిచేయగలిగే ప్రాజెక్టులను పీఎంకేఎస్‌వై కింద తీసుకుని వేగంగా నిర్మించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ కమిటీ కేంద్రానికి పలు సిఫారసులు చేసింది. సమావేశం అనంతరం కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరెతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

 కరువు రాష్ట్రాలను ఆదుకోవాలి
 ‘ఏఐబీపీ కింద గతంలో 90% నిధులను కేంద్రం అందించేది. దాన్ని 60 శాతానికి తగ్గించారు. తెలంగాణలోగానీ, మహారాష్ట్రలోగానీ, అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో ఏఐబీపీ సాయం 25 శాతమే ఉంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, కరువులో ఉన్న రాష్ట్రాలకు సాయం పెంచాల్సిన అవసరాన్ని చెప్పాం. 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరించేలా చూడాలని కోరాం. ఉదాహరణకు దేవాదుల, మరికొన్ని ప్రాజెక్టులకు 25 శాతం మాత్రమే ఉంది. అందువల్ల అన్నింటికీ 60 శాతానికి పెంచాలి. కేంద్ర సాయం లేకుండా ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయడం సాధ్యం కాదు. క్లియరెన్స్‌లు ఆలస్యం చేయకుండా సీడబ్ల్యూసీ ప్రాంతీయ కార్యాలయాలను పటిష్టం చేయాలి. రాష్ట్రాల్లో ఉన్న సీడబ్ల్యూసీ అధికారులు ఇఎన్‌సీలతో ప్రతి నెలా సమీక్ష నిర్వహించాలి. కేంద్రం నుంచి కూడా ప్రతినెలా రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సిఫారసు చేశాం’ అని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ‘ 2012లో ఏఐబీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులకు ఈరోజు కేవలం 20 శాతం ఎస్కలేషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది.

అయితే ఆయా ప్రాజెక్టులకు 50 శాతం వరకు ఎస్కలేషన్ అవసరం ఉంది. అందువల్ల నాబార్డు నుంచి రుణం ఇప్పించాలని సూచించాం. ప్రాజెక్టులు మరింత వేగంగా పూర్తిచేసేలా అన్ని రకాలుగా ఆర్థిక వనరులు సమకూర్చాలి. దేవాదులకు ఈ ఏడాది రూ. 112 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. దేవాదులతో పాటు శ్రీరాంసాగర్ వరద కాలువ పథకాన్ని, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాన్ని, పెద్దవాగు(జగన్నాథ్‌పూర్), కొమురం భీం ప్రాజెక్టులను కూడా ఏఐబీపీలో చేర్చాలని కోరాం. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లను ఏడాది చివరలో కాకుండా మొదటి నెలలోనే 50 శాతం విడుదల చేయాలని కూడా సిఫారసు చేశాం’ అని హరీశ్‌రావు తెలిపారు.
 

మరిన్ని వార్తలు