తగ్గిన క్యాంపస్‌ జాబ్స్‌.. 101 కాలేజీల మూసివేత

25 Apr, 2018 14:33 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రాంగణ నియమాకాలు తగ్గడం, కళాశాలల్లో సీట్ల మిగులు పెరగడంతో 2017-18 సంవత్సరానికి గాను స్వచ్ఛంద మూసివేతకు అనుమతి ఇవ్వాల్సిందిగా దేశ వ్యాప్తంగా దాదాపు 100 మేనేజ్‌మెంట్‌ కళాశాలలు దరఖాస్తు చేసుకున్నట్లు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) తెలిపింది. జాతీయ సాంకేతిక విద్య సమాఖ్య(ఏఐసీటీఈ) వివరాల ప్రకారం మేనేజ్‌మెంట్‌ కోర్సులైన ఎంబీఏ, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ కోర్సును అందించే ఈ 101 బిజినెస్‌ స్కూల్స్‌లో అత్యధిక భాగం ఉత్తరప్రదేశ్‌ (37)కు చెందినవి కాగా తరువాతి స్థానాల్లో కర్ణాటక (10), మహారాష్ట్ర (10) నిలిచాయి. ఈ దరఖాస్తుల్లో ఎక్కువ శాతం కళాశాలలు మూసివేతకు అనుమతి పొందుతాయని అధికారులు తెలిపారు. ఏఐసీటీఈ నివేదికి ప్రకారం 2015-16 సంవత్సరంలో 66 కళాశాలలు, 2016-17లో 76 మేనేజ్‌మెంట్‌ సంస్థలు మూతపడినట్లు వెల్లడించారు.

కారణాలు ఇవే...
కొన్నాళ్ల కిందట మేనేజ్‌మెంట్‌ విద్య ఐఐఎమ్‌ల్లో, కొన్ని ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ మార్కెట్‌లో మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదివిన విద్యార్థులకు డిమాండ్‌ పెరగడంతో ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో మేనేజ్‌మెంట్‌ కళాశాలను ఏర్పాటు చేసింది. కానీ సరైన వసతులు, ప్రావీణ్యం కల అధ్యాపకులను నియమించడంలో వెనకబడింది. దాంతో ప్రాంగణ నియమాకలు తగ్గాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 3వేల సాంకేతిక, మేనేజ్‌మెంట్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో చాలా కళాశాలలు కనీస నిబంధనలను కూడా పాటించడం లేదు. విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించడంలో విఫలమవుతున్నాయి. దాంతో ఏటా ప్రాంగణ నియమాకాలు తగ్గిపోతున్నాయి. 2016-17 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 1.50 లక్షల మంది ఎంబీఏ పట్టభద్రులు మాత్రమే ప్రాంగణ నియమాకాల ద్వారా ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం మూతపడనున్న 101 కాలేజీల వల్ల 10 వేల సీట్లు తొలగించబడతాయి. ఇవేకాక మరికొన్ని సంస్థలు కేవలం మేనేజ్‌మెంట్‌ కోర్సులను మాత్రమే రద్దు చేయాల్సిందిగా ఏఐసీటీఈని కోరాయి. ఫలితంగా మరో 11 వేల సీట్లు తొలగించబడతాయని ఏఐసీటీఈ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 

ప్రభుత్వ స్పందన...
ప్రాంగణ నియామకాలు లేకపోవడమే కళాశాలల మూసివేతకు ప్రధాన కారణమని ఏఐసీటీఈ చైర్మన్‌ ఎస్‌ఎస్‌ మంథ తెలిపారు. కళాశాలల మూసివేతను ప్రభుత్వం పెద్ద సమస్యగా భావించడం లేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్‌ సుబ్రమణ్యం అన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కళాశాలలు స్వచ్ఛందగా మూతబడటం మంచి విషయమే. ఎందుకంటే ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించాలనుకుంటుంది. దానికి నంబర్లతో పనిలేదు. విద్యాప్రమాణాలను పెంచడం కోసం ప్రభుత్వం నూతన విధానాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా కళాశాలల గుర్తింపు కోసం మెనటర్‌షిప్‌ విధానాన్ని, విద్యార్థుల కోసం ఇండక్షన్‌ కార్యక్రమాలను రూపొందించింది. విద్యార్థులకు, పరిశ్రమకు మధ్య వారధి నిర్మించి అర్హులైన వారి ఉపాధి కల్పనకు ప్రభుత్వ కృషి చేస్తుందని చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా